ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి

Dec 30,2023 22:14
సమగ్రశిక్షలో పనిచేస్తున్న

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం, గోకవరం

సమగ్రశిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌.పాలసీ అమలు చేయాలని మాజీ మంత్రి, టిడిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కెఎస్‌.జవహర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేస్తున్న నిరసన శిబిరాన్ని ఆయన సందర్శించి, వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతమున్న పార్ట్‌ టైం విధానాన్ని రద్దుచేసి, ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని, కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి మార్చి, మినిమం టైం స్కేల్‌ అమలు చేసి, వేతనాలు పెంచాలని ఆయన కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్న న్యాయపరమైన డిమాండ్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది వంద రోజుల్లో టిడిపి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే, సమగ్రశిక్ష ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని, ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని, జెఎసి నాయకులు ఎమ్‌.రఘునాథ్‌, డి.వంశికృష్ణంరాజు, ఆర్‌. వెంకట్రాజు, మిరపరాజు, వెంకట్‌లు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఎంప్లాయిస్‌ ఉద్యోగుల సంఘ నేత కెఎస్‌పి.రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగులు వి.నాగరాజు, నిర్మలజ్యోతి, చిట్టి, గంగభవాని, విజరు, శివ, సాయి ప్రియాంక, సురేంద్ర, కుమారి, కుసుమ, వీరబాబు, సత్యనారాయణ, మాణిక్యాంబ, శిరీష, చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

గోకవరం యుటిఎఫ్‌ శాఖ మద్దతు

రాజమహేంద్రవరంలో డిఇఒ కార్యాలయం వద్ద ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు గోకవరం మండల యుటిఎఫ్‌ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.నాగభూషణం మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి నెల ఒకటో తేదీనిజీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే యుటిఎఫ్‌ గోకవరం మండల శాఖ అధ్యక్షులు ఆర్‌.హరినాథ్‌, ప్రధాన కార్యదర్శి పివిఎస్‌ఆర్‌.త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మండల యుటిఎఫ్‌ శాఖ పక్షాన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు రూ.5 వేలు సాయాన్ని అందించారు.

➡️