ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల జలదీక్ష

Jan 3,2024 23:20
తమను విద్యాశాఖలో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

తమను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సర్వశిక్షా ఉద్యో గులు చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం పుష్కర ఘాట్‌ వద్ద గల గోదావరిలో జలదీక్షను చేపట్టారు. బుధవారం డిఇఒ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (జెఎసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 15వ రోజు నిరవధిక సమ్మె దీక్ష జరిగింది. దీక్షా శిబిరం నుంచి పుష్కర ఘాట్‌ వరకూ ప్రదర్శనగా చేరుకున్న ఉద్యోగులు గోదావరిలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పార్ట్‌ టైం విధానాన్ని రద్దుచేసి, ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని, కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి మార్చి, వేతనాలు పెంచి ప్రతీ నెల ఒకటవ తేదీన విడుదల చేయాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్న న్యాయపరమైన డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదనిజెఎసి నాయకులు ఎమ్‌.రఘునాథ్‌, డి.వంశీకృష్ణం రాజు, పి.దుర్గా ప్రసాద్‌, ఆర్‌.వెంకట్రాజు, మిరపరాజు, వెంకట్‌ స్పష్టం చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరకుని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమాల్లో సమగ్రశిక్ష ఉద్యోగులు శ్రీదేవి, పెద్దిరాజు, ప్రియదర్శిని, స్వప్న ప్రియ, సుమలత, మహేశ్వరి, కొండలరావు, మునీశ్వరరావు, లక్ష్మణ్‌, చిన్న రామారావు, సతీష్‌, శ్రీనివాస్‌, రవి, ప్రసన్న, మోహిని, దుర్గ, బాబ్జి, ప్రవీణ, అరుణకుమార్‌, జగన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️