ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది వేతన వెతలు

Dec 9,2023 23:17
ఎస్‌ఎస్‌ఎ

నాలుగు నెలలుగా అందని జీతాలు
ఆందోళనలో సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు
ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తం
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి
విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు వేతన వెతలు ఎదుర్కొంటున్నారు. నాలగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. రెగ్యులరైజ్‌ చేస్తామంటూ ఎన్నికల ముందు వైసిపి అధినేతగా జగన్‌ ఇచ్చిన హామీని సైతం నాలుగున్నరేళ్లలో అమలు చేయలేదు. జిల్లాలో సర్వ శిక్ష అభియాన్‌ ప్రాజెక్టులో 385 మంది ఉద్యోగులున్నారు. నాలుగు నెలలుగా రూ.3 కోట్లకుపైగా వేతనాలు బకాయిలు ఉన్నాయి. వేతనాలు లేక ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టులో సిఆర్‌ఎంటిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐ ఎస్‌ కో-ఆర్డినేటర్లు, మండల లెవెల్‌ అకౌంటెంట్స్‌, మెసెంజర్స్‌, సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్స్‌, భవిత ఆయ, ఫిజియోథెరపిస్టులు, హై స్కూల్స్‌ మరియు అప్పర్‌ ప్రైమరీ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పిఇటి పార్ట్‌ టైం టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటం, సమస్యలను పరిష్కరించకపోవటంతో కోర్కెల సాధన కోసం సంఘంగా ఏర్పడి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సమ్మేకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. 8న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు.
హామీలు బుట్టదాఖలు
ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెగ్యులరైజ్‌ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, అన్ని విధాలుగా కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రకటన చేసిన కనీస వేతనం జివొలను సైతం అమలు చేయలేదు. పిఆర్‌సి అమలు చేయకుండా, త్వరలో అమలు చేస్తున్నామని శాసన మండలిలోనూ, విద్యాశాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చి మూడేళ్లు గడిచినా దాని ఊసే లేదు. కొన్ని విభాగాలకు, కెజిబివి టీచర్లకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారు. కొన్ని విభాగాలకు పిఆర్‌సి అమలు చేయలేదు. మరో వైపు ఉద్యోగుల మధ్య విభేదాలు, విభజన సష్టించే విధానాలను అమలు చేస్తూ, ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సంప్రదాయాన్ని గాలికి వదిలేశారు. పాత వారికి జీతం పెంచలేదు. పార్ట్‌ టైం పేరుతో తక్కువ జీతాలు ఇచ్చే విధానాలను అమలు చేస్తున్నారు. ఒకే తరహా ఉద్యోగం చేస్తున్నా వేర్వేరుగా వేతనాలు అమలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
ఉద్యోగుల డిమాండ్లు ఇవీ..
సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి. లేదా ప్రస్తుతానికి అందరికీ కనీస వేతనం అమలు చేయాలి. పార్ట్‌ టైం విధానాన్ని రద్దు చేసి, ఫుల్‌ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలి, పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్‌ హోదాను ఒషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా మార్చాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. రూ.10 లక్షలు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ కల్పించాలి. సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలి, మెరుగైన హెల్త్‌ స్కీం అమలు చేయాలి. సిఆర్‌ఎంటిలు డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్స్‌, మండల లెవెల్‌ అకౌంటెంట్స్‌, మెసెంజర్స్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, పిఇటి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. పని భారం తగ్గించాలి, అన్ని పోస్టులకు కచ్చితమైన జాబ్‌ ఛార్ట్‌ ఇవ్వాలి. ఫీల్డ్‌ లెవెల్‌లో తిరిగే సమగ్ర శిక్ష ఉద్యోగులకు బీమా సౌకర్యం అమలు చేయాలి. ఎక్స్‌ గ్రేషియా రూ.20 లక్షలకు పెంచాలి, పెండింగ్‌ ఎక్స్‌ గ్రేషియా లను వెంటనే చెల్లించాలి.మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి, కారుణ్య నియమాలు చేపట్టాలి. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవులు మంజూరు చేయాలి. ప్రతి నెలా ఒకటో తేదీకి వేతనాలు చెల్లించాలి, వేతనాలు కోసం సంవత్సరానికి సరిపడే బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలి.ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్‌చేయాలి.
బకాయి వేతనాలు తక్షణమే విడుల చేయాలి.
4 నెలలుగా ఒకొక్క ఉద్యోగికి రూ. 80వేల వరకూ బకాయిలు ఉన్నాయి. నెలల తరబడి పెండింగ్‌ ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే బకాయి వేతనాలు విడుదల చేయాలి. న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలి.
– ఎం.రఘునాథ్‌, సిఆర్‌పి సర్వశిక్ష అభియాన్‌

➡️