ఎస్మా ను వెంటనే రద్దు చేయాలి

Jan 11,2024 21:01

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : అంగన్వాడీలపై అక్రమంగా ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించి, వారి సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ముఖ్యకంఠంతో డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్జీవో హౌంలో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా, దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 31 రోజు నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగినందుకు అంగన్‌వాడీలను భయభ్రాంతులకు గురి చేయడానికి 27 రోజుల తర్వాత అంగన్వాడీలు అత్యవసర సేవలు విభాగంలోకి వస్తారని చెప్పి ఎస్మా జీవో 2ను తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి పచ్చి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అంగనవాడీ సేవలు అత్యవసర విభాగాలకు రావని, ఆ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడం దారుణమన్నారు. కేంద్ర బిజెపి అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలనే రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇలాంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా సమగ్ర శిక్ష, మున్సిపల్‌ ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించినట్లు అంగన్‌వాడీలను కూడా చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అంగన్వాడీల సమస్య పరిష్కరించకపోతే సంక్రాంతి తర్వాత రాష్ట్ర బందును జయప్రదం చేయాలని, ఎస్మా, షోకాజ్‌ నోటీసులు వెనక్కి తీసుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర, సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు, అంగన్వాడీ నాయకులు జి.జ్యోతి, గౌరి, మణి, రైతు కూలీ సంఘం నాయకులు శ్రీను నాయుడు, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ బి.నరసింగరావు, సిపిఐ ఎంఎల్‌ జిల్లా నాయకులు ఎం.బాషా. గిరిజనసంక్షేమ సంఘం నాయకులు రంజిత్‌ కుమార్‌, ప్రగతి మహిళా సంఘం నాయకులు పి.రమణి, మానవ హక్కుల సంఘం నాయకులు వి దాలినాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు, ఎఐవైఎఫ్‌ గోపి నాయుడు, రైతు సంఘం నాయకులు బి.దాసు, గిరిజన సంఘం నాయకులు రామస్వామి. ఐద్వాజిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీదేవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

➡️