ఎస్మా ప్రయోగంపై అంగన్‌వాడీల ఆగ్రహం

Jan 7,2024 23:04
అంగన్‌వాడీల సమ్మెపై

ప్రజాశక్తి – యంత్రాంగం

అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్‌వాడీల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడితే పోయేదేమి లేదు…బానిస సంకెళ్లు తప్ప అంటూ రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు అంగన్‌వాడీలు సిద్ధం అవుతున్నారు. అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 27వ రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా వివిధ సెంటర్లలో ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ ప్రతులను దహనం చేశారు. కాకినాడ స్థానిక ధర్నా చౌక్‌ వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల 27వ రోజు దీక్షను ఆదివారం ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి సందర్శించి మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలపై ఉక్కుపాదాన్ని మోపేందుకు జగన్‌ సర్కార్‌ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. ఎన్నో పోరాటాలను సాగించిన అంగన్‌వాడీల ఉద్యమాన్ని ఇటువంటి చట్టాలు ఏమీ చేయలేవని అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్మా చట్టాల ద్వారా ఉద్యమాలను అణిచివేయాలని చూసిన గత ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో గుర్తు చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంగన్వాడీల పోరాటానికి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి నొక్కు లలిత, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి సింహాచలం, ఐఎఫ్‌ టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాఘవులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, సిఐటియు జిల్లా నాయకులు మేడి శెట్టి వెంకటరమణ, సొసైటీ ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆది నారాయణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు మద్దతుగా మాట్లాడారు. పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ విడుదల చేసిన జివో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు దాడి బేబీ మాట్లాడుతూ గతంలో ఉద్యోగుల, కార్మికులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వాలు రాజకీయంగా ఏవిధంగా పతనం అయ్యాయో చరిత్రను తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంగన్‌వాడీల సమ్మెకు సామర్లకోట యుటిఎఫ్‌, ప్రజానాట్యమండలి కళాకారులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.క్రాంతికుమార్‌, యూనియన్‌ నాయకులు అమల, నాగమణి, టిఎల్‌ పద్మావతి, తులసి, స్నేహలత, లక్ష్మి, నాగదేవి, జి.మహాలక్ష్మి, జి.లోవ కుమారి, తదితరులు పాల్గొన్నారు. కిర్లంపూడి అంగన్‌ వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జారీ చేసిన జిఒను కాఫీ లను దహనం చేశారు. స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ మండల అధ్య క్షురాలు రత్నం, కె.అచ్యుతాంబ, ఎలిజిబిత్‌ రాణి, పి.సావిత్రి, షేక్‌ పరివిన్‌, జి.రత్నం, పి.మంగాయమ్మ, పి.ప్రభావతి, హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

➡️