ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

Feb 18,2024 21:04

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: ఐక్య పోరాటాలతోనే న్యాయమైన డిమాండ్ల పరిష్కారమవుతాయని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో ఆదివారం అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ విజయోత్సవ సభను నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలన సాగిస్తుందన్నారు. ఒకవైపు కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కోస్తూ మరోవైపు మతోన్మాద పార్టీగా పాలన సాగిస్తోందన్నారు. మోడీ హయంలో కార్మికులకు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత పూర్తిగా కరువైందన్నారు. విగ్రహ ప్రతిష్టలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజలు, ఉద్యోగుల సంక్షేమంపై లేదన్నారు. తన స్వార్ద రాజకీయాల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడంతో కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నెలరోజులకు పైగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసినా పూర్తిస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపలేదన్నారు. మోడీ విధానాలనే రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి.జ్యోతి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలపై భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంఘటితంగా పోరాటం చేయడం వల్లే 11 డిమాండ్లలో 10 డిమాండ్లకు పరిష్కారం చూపించారని అన్నారు. జీతాల పెంపుదల విషయం నెరవేర్చకపోవడం విచారకరమన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మనం సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ సమస్యలపై పోరాటాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన భయపడకుండా పోరాటం చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, కోశాధికారి మండంగి రమణ, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు కస్తూరి, సత్యవతి, సిఐటియు నాయకులు కె.గౌరీశ్వరరావు తదితరులు ఉన్నారు.అంగన్‌వాడీ పోరాటం చిరస్మరణీయం పాచిపెంట : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు 43రోజుల పాటు చేపట్టిన పోరాటం చిరస్మరణీయమయని, ఎన్ని ఆటంకాలు వచ్చినా పోరాడి హక్కులు సాధించుకోవడం అభినందనీయమని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి అన్నారు. పాచిపెంటలోని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీల అభినందన సభ ఆదివారం జరిగింది. ఈ అభినందన సభలో ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని అర్థం చేసుకొని వారి డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. అధునాతనమైన సెల్‌ ఫోన్లు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని, ఐసిడిసిన్‌ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఐసిడిఎస్‌ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు వి.ఇందిర, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ విజయనగరం జిల్లా నాయకులు వి.లక్ష్మి మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పోరాడి హక్కులు సాధించుకున్న అంగన్‌వాడీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని పోరాటాలు చేసి ఉద్యమాల ద్వారా తమ న్యాయమైన హక్కులు సాధనకై సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాల్లో ముందు భాగాన నిలబడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️