ఒంటెద్దు పోకడలకు పోవద్దు: విఎస్‌ఆర్‌

ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలకు పోకుండా అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలిపి ఆయన మాట్లాడారు. గత ఎన్నికలముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెంచిన జీతాలకు అదనంగా వెయ్యి రూపాయలు మాత్రమే పెంచినట్లు తెలిపారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సిగ్గుచేటన్నారు.అంగన్‌వాడీలకు ఇచ్చేందుకు రూ.100 కోట్లు లేవని, వైజాగ్‌లో ప్రభుత్వ కార్యాలయాల పేరిట సొంత విలాసాలకి రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులపై కక్ష సాధింపుతో ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలు ఏమయ్యాయో ఒకసారి గుర్తుంచుకోవాలన్నారు. అంగన్‌వాడీలకు సరైన జీతాలు ఇవ్వకపోగా వారి చేత రకరకాల యాపులతో వెట్టిచాకిరి చేస్తున్నారని విమర్శించారు. న్యాయబద్ధంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మెకు అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పొదిలి యుటిఎఫ్‌ శాఖ రూ.5000, మరిపూడి మండలం కెల్లంపల్లికి చెందిన వంకాయలపాటి శాంతి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని పదివేల ఆర్థిక సహాయాన్ని అంగన్‌వాడీలకు అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా నాయకులు ఎస్‌కె.అబ్దుల్‌ హై, పెమ్మని బాల వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌, పొదిలి మండల యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పాలడుగు వెంకటేశ్వర్లు, కెకెమిట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాసర్‌ మహామ్మద్‌, కామేశ్వరరావు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు బుజ్జిబాబు, సంజీవరావు,నారాయణ రెడ్డి, ఓబుల్‌ రెడ్డి, గోనె శ్రీనివాసులు, ఆంజనేయ చౌదరి, పొదిలి తాలూకా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు బాదుల్లా, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత ఎస్‌కె ఖాదర్‌ బాషా పాల్గొన్నారు.

➡️