ఓటరు జాబితాపై పక్కాగా విచారణ

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఓటరు జాబితా విచారణ పక్కాగా చేపట్టాలని ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ జె.శ్యామలరావు అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన.. ఓటరు నమోదు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఫారం-6, 7, 8 ఏవిధంగా విచారణ చేశారో ఆయా ఫారాలను జిల్లాలో నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో వివిధ బూత్‌ స్థాయి అధికారుల వద్ద స్వయంగా పరిశీలించారు. ఒక్కో బూత్‌ స్థాయిలో ఏ సంఖ్యలో దరఖాస్తులు అందాయో పరిశీలించారు. ఓటరు ఫారాల విచారణ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను ఆయా వ్యక్తులు సమర్పించారా? లేదా సుమోటోగా సమర్పించారా? వంటి విషయాలను ఆరాతీశారు. ఒకే ఇంటి నంబరుతో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండటం, ఒకసారే గంపగుత్తగా దరఖాస్తులు సమర్పించడం వంటి అంశాలను పరిశీలించారు. ప్రత్యేక ఓటరు నమోదు రోజుల నిర్వహణ, అందిన దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ఓటర్లను తొలగించే ప్రక్రియను విచారించారు. ఒకే ఫొటోతో ఎక్కువ ఓట్లు ఉండటం, ఒకే ఓటు రెండు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నమోదు వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోల్‌ అబ్జర్వర్‌ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తు పక్కాగా విచారణ చేయాలని, ఎండార్సుమెంటు నివేదిక సరిపోవాలని ఆదేశించారు. విచారణకు సంబంధించిన పత్రాలు నిర్దిష్టంగా ఉండాలని, చేర్పులు, మార్పులు జరిగితే వాటి వివరాలు స్పష్టంగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాలో ఒకే ఫొటో పలుమార్లు ఉంటే వాటిని గమనించి ప్రామాణిక పద్ధతిలో సరిచేయాలని చెప్పారు. ప్రతి బూత్‌లో బూత్‌ స్థాయి ఏజెంట్‌ ఉండాలని స్పష్టం చేశారు. బూత్‌ స్థాయి అధికారులకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. మృతిచెందిన ఓటర్ల తొలగింపు ప్రక్రియ పక్కాగా చేపట్టాలని, సంబంధిత పత్రాలు ఉండాలని ఆదేశించారు. యువ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 37873 మంది యువ ఓటర్ల అంచనాలో ఇప్పటికీ 8633 మంది మాత్రమే నమోదైనట్లు వివరించారు. జనాభా – ఓటరు నిష్పత్తిలో తేడాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ నిష్పత్తిలో ఉంటే కారణాలు విశ్లేషించాలని సూచించారు. ఈ నెల 26 వరకు అందిన అభ్యంతరాలు, క్లైమ్‌లు పరిష్కరించి తప్పులు లేని తుది ఓటరు జాబితా ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ అందిన ప్రతి ఫిర్యాదును విచారిస్తున్నట్లు తెలిపారు. మృతిచెందిన ఓటర్ల వివరాలు ఓటరు నమోదు అధికారి విధిగా పరిశీలించాలని ఆదేశించామని చెప్పారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో చేర్చిన ఓటర్ల వివరాలు పార్టీలకు అందించడం వల్ల అపోహలకు తావు ఉండదని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవింద రావు, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఓటరు నమోదు అధికారులు- సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలు కల్పనా కుమారి, సి.విష్ణు చరణ్‌, ఆర్‌డిఒలు కె.హేమలత, ఎం.లావణ్య., కెఆర్‌ఆర్‌సి ఎస్‌డిసి జి.కేశవనాయుడు, టిడిపి ప్రతినిధి జి.వెంకటనాయుడు, సిపిఎం ప్రతినిధి రెడ్డి వేణు, వైసిపి ప్రతినిధి మరిశర్ల బాపూజీ నాయుడు, సిపిఐ ప్రతినిధి ఇవి నాయుడు, జనసేన పార్టీ ప్రతినిధి బడే శ్రీనివాసరావు , బిజెపి ప్రతినిధి పారిశర్ల అప్పారావు, ఆమ్‌ఆద్మీ ప్రతినిధి పి.రవికుమార్‌, బిఎస్‌పి ప్రతినిధి టి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️