సమిష్టిగా అభివృద్ధి పథంలో నడిపిద్దాం : ఎమ్మెల్యే

Jun 28,2024 21:13

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : సమిష్టిగా పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కౌన్సిలర్లు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన జరిగిన మున్సిపల్‌ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారిగా మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, కార్యాలయంలోని పలు విభాగాలు అధికారులతో కలిసి సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చాలను అందించి దుశ్శాలవతో సత్కరించి, అభినందనలు తెలిపారు. అనంతరం కౌన్సిల్‌ సమావేశ మందిరానికి వెళ్లిన ఎమ్మెల్యే చైర్‌పర్సన్‌ తో పాటు వైసిపి కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు. చైర్‌పర్సన్‌ కుర్చీ పక్కనే ఎమ్మెల్యేకు మరో కుర్చీ వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పలు మున్సిపాల్టీల్లో చైర్‌పర్సన్‌ పక్కనే ఎమ్మెల్యేలు, మంత్రులు, కూర్చోవడం ఎక్కడ చూడలేదని, ఇటువంటి కొత్త సాంప్రదాయానికి గత పాలకులు తెరలేపారని, అలాంటి సాంప్రదాయం తమకు వద్దని కౌన్సిల్‌ సభ్యులచే ఎన్నుకోబడిన చైర్‌పర్సన్‌ కు మాత్రమే సమావేశాన్ని నడిపించడం జరుగుతుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చారని, వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు తీర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపి పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటాననివిజరు చంద్ర అన్నారు. పోడియం దిగువన ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకతీతంగా పట్టణ అభివృద్ధి అందరి లక్ష్యం కావాలని అన్నారు. ఏ అభివృద్ధి పని అవసరమైనా తనను సంప్రదించవచ్చని, ప్రజల సమస్యలే ముఖ్యం తప్ప రాజకీయాలు కాదని వివరించారు. అజెండాలో పొందుపరిచిన 14 అంశాలను అధికారులు చదివి వినిపించారు. జీరో అవర్‌లో 14వ వార్డు కౌన్సిల్‌ సభ్యులు ద్వారపు రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ 30 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ బాగాలేదని, దీనిపై దష్టి పెట్టాలని కోరారు. టిడ్కో ఇళ్ల గురించి లబ్ధిదారులు డబ్బులు చెల్లించారని, ఆ డబ్బులను తిరిగి ప్రభుత్వం చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, ఇళ్లు రాని లబ్ధిదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే జగనన్న లే అవుట్‌లో అక్రమాలు జరిగాయని, వాటిపై కమిటీని వేసి నిజమైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. 8వ వార్డు కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మున్సిపల్‌ కార్యాలయంలో 27 మందికి ఔట్సోర్సింగ్‌ ఉద్యోగాలు వేశారని, వారు ఎవరో, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు తెలియపర్చాలని కోరారు. తమ వార్డులో ఉన్న శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని గతంలో కోరగా ఇంతవరకు అభివృద్ధి పనులు చేపట్టడం లేదని తెలిపారు. పదో వార్డు వైసిపి కౌన్సిల్‌ సభ్యులు జె.దివ్య మాట్లాడుతూ తమ వార్డులో పారిశుధ్య సక్రమంగా లేదని,కాలువలు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే ఎంతో సమయస్ఫూర్తితో సమాధానాలు ఇస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో వైస్‌ చైర్‌ పర్సన్లు కొండపల్లి రుక్మిణి, ఇండుపూరు గున్నేష్‌ , ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, పలువురు కౌన్సిలర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️