ఓపిఎస్‌ అమలుచేసే వారికే మద్దతు: యుటిఎఫ్‌

ప్రజాశక్తి-చీరాల: ఓపిఎస్‌ అమలు చేసే నాయకులకే తమ మద్దతు ఉంటుందని యుటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని స్వయానా హామీ ఇచ్చి దాని స్థానంలో నష్టదాయకమైన జీపీఎస్‌ విధానాన్ని తీసుకురావడం దారుణమని విమర్శించారు. యుటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ రాజకీయ పార్టీ అయితే పాత పెన్షన్‌ విధానం అమలు మానిఫెస్టోలో పెడతారో, అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సంతకం ఓపిఎస్‌ ఫైల్‌పై చేస్తారో ఆ పార్టీకి ఉద్యోగ, ఉపాధ్యాయుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఈ రోజు ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చేస్తున్నామని తెలియజేశారు. సహాధ్యక్షులు బండి బిక్షాలుబాబు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా పోస్ట్‌కార్డు క్యాంపెయిన్‌, దిగువ స్థాయి రాజకీయ నాయకుల నుంచి మద్దతు కూడగడతామని తెలియజేశారు. సీనియర్‌ నాయకులు కొమ్మూరి వీరాంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురేష్‌, జానీ, కుర్రా శ్రీను, మాసెట్టి శ్రీను, వెలుగొండారెడ్డి, సుబ్బారెడ్డి, మాల్యాద్రి, సూరిబాబు, గాంధీ, కిష్టాఫర్‌, బంగారుతల్లి, విజయవర్దన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️