‘కంది’ పోయింది –

Jan 26,2024 23:54 #కంది పంట

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పంట చేతికందే సమయానికి అతివష్టి, అనావష్టి కారణంగా నష్టపోతున్నాయి. ఫలితంగా కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. ఐదేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతోకనీసం పెట్టుబడులూ దక్కని పరిస్థితి ఉంది. ఈ ఏడు వర్షాల లేమి కారణంగా కంది పంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గత ఏడాది కంది పంట వేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏడాది తాము గట్టెక్కుతామన్న ఆశతో రైతులు కంది పంట సాగు చేశారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు చీడపీడలు వెంటాడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాధారం కింద 23 వేల ఎకరాలలో కంది పంట సాగు చేశారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో రైతులకు నిరాశే మిగిలింది. పూత, కాయ దశలో వర్షాలు కురవకపోవడం, వాతావరణంలో మార్పులు కారణంగా గింజలకు చీడపీడలు ఆశించడంతో పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడి తగ్గే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు సేద్యం ఖర్చులతో పాటు విత్తనాలు, పిచికారీ మందులకు రూ.22 వేల వరకు వెచ్చించినట్లు రైతులు చెబుతున్నారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి వెంకటేశ్వర్లు నాయక్‌, రైతు, పిల్లికుంట తాండా ఐదు ఎకరాల్లో కంది పంటను సాగు చేశా. రూ. లక్ష వరకూ పెట్టుబడి పెట్టా. వర్షాలు లేకపోవడం, వాతావరణ మార్పుల కారణంగా పంట దెబ్బతింది. పూత రాలిపోవడంతో ఈనెలుగా మారింది. ఎకరాకు రెండు క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. కంది రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.ఆరుసార్లు మందు పిచికారీ చేశాపోతుల ఆదినారాయణ, రైతు, యర్రగొండపాలెం ఐదు ఎకరాల్లో కంది పంటను సాగు చేశాను. చీడ పీడల నివారణకు ఆరుసార్లు మందు పిచికారీ చేశా. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆకులు రాలి గింజ నాణ్యతతో పాటు దిగుబడి పూర్తిగా తగ్గింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు.

➡️