కదం తొక్కిన ఆశాలు

Dec 14,2023 22:58
భారతి, అంకాడి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ఎన్నో ఏళ్లుగా అపరిస్తృతంగా ఉన్న ఆశాల కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రెండురోజులపాటు చేపట్టిన 36 గంటల నిరసన కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు కాకినాడలో కదం తొక్కారు. నిరంతరం పని ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తిస్తున్నా వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వారు నిరసన గళం విప్పారు. కనీస వేతనాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆరోగ్య సేవలు అందించడంలో కీలకంగా పనిచేస్తున్న ఆశలకు రూ.26 వేలు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆశ వర్కర్లు ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 36 గంటలపాటు కలెక్టరేట్‌ దగ్గర గురువారం ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి ధర్నాను ప్రారంభించి మాట్లాడారు. జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ధరలు 500 శాతం పెరిగాయని, జీతాలు మాత్రం పెరగలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అందుకు జగన్‌ వేసే అదనపు పన్నులే కారణమన్నారు. ప్రాణాలకు తెగించి కోవిడ్‌ కాలంలో పనిచేసిన ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు చెల్లించకుండా జగన్‌ ప్రభుత్వం శ్రమదోపిడి చేస్తుందని మండిపడ్డారు. తక్షణం ప్రతి ఆశా కార్యకర్తకు రూ.26 వేలు కనీస వేతనం అమలు చేయాలని, రూ.10 లక్షలు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, ఆన్‌లైన్‌ పేరుతో వేధింపులు ఆపి, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశాలను పరిగణించి సంక్షేమ పథకాల నుంచి దూరం పెడుతూ, వేతనాలు చెల్లించేటప్పుడు ఆశాలను గౌరవవేతనం పేరుతో పిఆర్‌సి అమలు కాకుండా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. తక్షణం ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఆర్‌సి అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ ఇవ్వాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని, చనిపోయిన ఆశా కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలు ఆశలకు వర్తింప చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నా శిబిరానికి టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు, ఎపిఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు విజరు కుమార్‌, మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఏచూరి శ్రీనివాస్‌ మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాయుడు రమేష్‌, చివుకుల వెంకటరావు, వెంకన్న, స్వామి, రాయుడు నాగలక్ష్మి, మడికి లక్ష్మి, ముప్పిడి ఆశాజ్యోతి, భారతి, అంకాడి పద్మావతి, మలకా నాగలక్ష్మి, చెక్కల వేణి పాల్గొన్నారు.

➡️