కళ్లకు గంతలతో మోకాళ్లపై నిరసన

Mar 19,2024 23:50

ప్రజాశక్తి – ఫిరంగిపురం : జీతం బకాయిల కోసం మండల కేంద్రమైన ఫిరంగిపురంలో పంచాయతీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. మంగళవారం సమ్మె శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిరసన తెలిపారు. తమకు రావాల్సిన 9 నెలల జీతాలను, హరిత రాయబారులకు పెండింగ్‌ జీతాలను ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా సమ్మె శిబిరంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కేరళ మాజీ సిఎం, సిపిఎం అగ్రనేతల్లో ఒకరైన ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి సభలు నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమా లలేసి నివాళులర్పించారు. సిహెచ్‌ రామారావు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు మండల కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం అతి చిన్న వయస్సులోనే తుపాకి పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేగా మహిళల, రైతుల, కార్మికుల, కర్షకుల సమస్యలను అసెంబ్లీలో వినిపించారని, అనేక అభివృద్ధి కార్యక్రమాలనూ చేశారని తెలిపారు. తుదిశ్వాస వరకూ ప్రజల కోసమే పరితపించారని అన్నారు. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ దాదాపు ఏడు దశాబ్దాల పాటు ప్రజా జీవితం గడిపారని, శ్రామిక ఉద్యమాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. 1931లో కాలేజీ చదువును మానేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, జైలు శిక్షనూ అనుభవించారని తెలిపారు. 1936 కేరళలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక బృందంలో ఆయన ఒకరన్నారు. ఆయన రచనలను అధ్యయనం చేయాలని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు ప్రభుదాస్‌, బాలస్వామి, సతీష్‌, ఓర్సు బాలయ్య, శ్రావణ్‌, సునీత, ఏసమ్మ, వెంకటేశ్వరమ్మ, సిఐటియు మండల కార్యదర్శి ఇబ్రహీం, అనోక్‌, రాజేశ్వరరావు పాల్గొన్నారు.

➡️