కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా పనిచేస్తున్నాయి. ఆర్‌బికేల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం ధాన్యం ధర మార్కెట్‌లో భారీగా పెరగడం వల్ల తుపానుకు దెబ్బతినకుండా నాణ్యతగా ఉన్న ధాన్యంను వ్యాపారులు రైతుల నుంచి పొలాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పొలాల్లో వరి నూర్పిడిలు జరుగుతున్నాయి. తడిసిన రంగుమారిన ధాన్యంను మిల్లర్లు ఇంకా కొనుగోలు చేయడం లేదు. గుంటూరు జిల్లాలో 1.05 వేల ఎకరాలు, పల్నాడు జిల్లాలో 20 వేల ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. ఈక్రాప్‌లో నమోదుచేసుకున్న వారి నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వరిసాగు చేసిన వారిలో 60 శాతం మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ఎక్కువమందికి సిసిఆర్‌సి కార్డులు లేకపోవడం వల్ల ఈ క్రాప్‌లో నమోదు కాలేదు. కొంత మంది రైతులకు సంబంధించి కౌలు కొంత భూమి, సొంతంగా కొంత భూమి సాగు చేశారు. పూర్తిగా కౌలుకు భూమి తీసుకుని సాగు చేసిన వారు ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు చేసిన వారికి తొలుత వర్షాభావం, ఆ తరువాత తుపాను రూపంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వరి పంట నీటిలో పూర్తిగా మునిగి భారీగా నష్టం జరిగింది. పలు చోట్ల వరి కంకులు మొలకెత్తాయి. తడిసిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న ధాన్యంను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు గత శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర ప్రజా పంపిణీ ఆహార శాఖ, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌ శివకుమార్‌ నేతృత్వంలో దెబ్బతిన్న వరి ధాన్యాన్ని పరిశీలించి శాంపిల్స్‌ సేకరించారు. రైతుల నుండి దెబ్బతిన్న ధాన్యం శాంపిల్స్‌ సేకరించి ప్రభుత్వ టెస్టింగ్‌ లాబరేటరీ కి పంపుతామని ఈ నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం ధాన్యం సేకరణ నిబంధనలు సడలింపు కొరకు నివేదిక పంపుతామని జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. చాలా ప్రాంతాల్లో ధాన్యం రంగు మారింది. కౌలు, ఇతర పెట్టుబడి కలిపి ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ రకం ధాన్యం క్వింటాలు రూ.2183 కనీస మద్ధతు ధరగా నిర్ణయించగా గ్రేడ్‌ఏ రకం రూ.2203గా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగానే రైతులనుంచి మిల్లర్ల నుంచి కనీస మద్ధతు ధరకి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందువల్ల రైతు భరోసా కేంద్రాలకురైతులు పెద్ద సంఖ్యలో రావడంలేదని తెలిపారు. మరో వైపులో పూర్తిగా నీటిలో మునిగిన ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో ధాన్యం నాణ్యత బాగుందని, దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల రైతుల నుంచి మిల్లర్లు 76కిలోల బస్తా రూ. 1600కి కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. బిపిటీ, సోనా మసూరి సాగు చేసినరైతులు మరోరెండు నెలలకు ధర మరింతపెరుగుతుందని భావించి పొలాల్లోనే కుప్పలు వేస్తున్నారు. కానీ తడిసిన రంగు మారిన ధాన్యం ధరమాత్రం బస్తా రూ.1200కి మించి కొనుగోలు చేసే పరిస్థితిలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బికేల ద్వారా విక్రయానికి రైతులు ఎక్కువమంది మొగ్గుచూపడం లేదు. ఆర్‌బికేల్లో విక్రయిస్తే నిధుల రావడంలో జాప్యం, తేమ శాతం నిబంధనలు రైతులకు ప్రతిబంధకంగామారాయి.

➡️