కుల, మత, ప్రాంతీయతత్వాలు లేకపోవడమే మంచిమార్గం

లింగారావుపాలెంలో మాట్లాడుతున్న తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ
ప్రజాశక్తి – యడ్లపాడు :
ప్రతిఏడాది మాదిరే ఈ ఏడాదీ మండంలోని లింగారావుపాలెంలో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో 44వ సంక్రాంతి క్రీడా, సాంస్కృతిక సంబరాలను నిర్వహించారు. భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆదివారం, సోమవారం రెండ్రోజులపాటు నిర్వహించిన సంబరాల్లో స్థానిక యువత, విద్యార్థులు అందరూ ఉత్సాహంగా పాల్గొనగా విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. తొలిరోజు ముఖ్యఅతిథులుగా తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పల్నాడు జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు, గ్రామ పెద్దలు ఆలోకం పెద్దబ్బాయి, బహుమతులను సమకూర్చిన ఎన్నారై ఆలోకం శ్రీరామ్‌ తరుపున తండ్రి అమరలింగస్వామి హాజరయ్యారు. కార్యక్రమానికి సంబరాల ఆర్గనైజింగ్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షత వహించగా వెంకటరమణ మాట్లాడుతూ యువకులు క్రియేటర్లుగా మారాలని, బహుముఖ పోటీల్లో పాల్గొనడం ద్వారా వాటిల్లోని సృజన అలవడుతుందని చెప్పారు. విజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించాలని సూచించారు. పేదలకు కుట్టు మిషన్ల పంపిణీ, కంటి శుక్లాల ఆపరేషన్లు, తదితర సేవా కార్యక్రమాలను తానా ఆధ్వర్యంలో చేస్తున్నామని చెప్పారు. రామన్న మాట్లాడుతూ యువత భగత్‌సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమాజాభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, ఇతర సమస్యలపై డివైఎఫ్‌ఐ పోరాటాలు, నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాల్లో కృషిని వివరించారు. పెద్దబ్బాయి మాట్లాడుతూ ప్రజల్లో ఐక్యత ప్రధానమని, ఇలాంటి కార్యక్రమాలు అందుకు దోహదపడతాయని చెప్పారు. ఇదే వాతావరణం కలకాలం కొనసాగాలని, కార్యక్రమాలకు తమ సహకారం నిత్యం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా 10 మందికి కుట్టు మిషన్లను తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ అందించారు.బహుమతి ప్రదానోత్సవం, ముగింపు సభకు ముఖ్యఅతిథిగా డాక్టర్‌ గోపాల శివనారాయణ, ఎంపిటిసి టి.వీరరాఘవయ్య, సర్పంచ్‌ షేక్‌ కరీమూన్‌, ఎ.పెద్దబ్బాయి, కె.శ్రీహరిరావు, ఎ.వెంకట లక్ష్మీనారాయణ, ఎన్‌.శివరామకృష్ణ, జెడ్‌పి పాఠశాల హెచ్‌ఎం కె.వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. డాక్టర్‌ గోపాలం శివనారాయణ మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ తత్వాల ఆలోచనల నుండి బయటకు రావడమే సమాజానికి మంచి మార్గమని చెప్పారు. వివేకానంద, భగత్‌సింగ్‌ ఆదర్శాలను వివరించారు. ప్రజానాట్య మండలి కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సీనియర్‌ కళాకారులు జగన్‌ గీతాలాపన ఆకట్టుకున్నాయి. క్రికెట్‌, షిటిల్‌ బ్యాడ్మింటన్‌, వ్యాసరచన, క్విజ్‌, చెస్‌, క్యారమ్స్‌, రన్నింగ్‌, కుండ కొట్టుడు, మార్నింగ్‌ స్పీడ్‌ నడక, తదితర 20 విభాగాల్లో పోటీలు నిర్వహించగా 400 మంది పాల్గొన్నారు. నిర్వాహక కమిటీ కన్వీనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ఆర్‌.సుమన్‌, జి.లెనిన్‌, కె.గోపి, రాహుల్‌, సురేష్‌, కె.రామోజీ, సిహెచ్‌.రంగారావు, జి.కోటేశ్వరరావు, అనంతలక్ష్మి, శివకుమారి, ప్రగతి పర్యవేక్షించారు.పుడమి గ్రూప్స్‌ అధినేత ముత్తవరపు సురేష్‌బాబు, అరుణకుమారి దంపతుల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన యడ్లపాడు లోని రచ్చబండ సెంటర్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. రంగవల్లులు, కుండకొట్టుడు, మోకులాగుడు, మ్యూజికల్స్‌ చైర్స్‌, లెమన్‌ అండ్‌ స్ఫూన్‌ తదితర పోటీల్లో మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : దుర్గి మండలంలోని ఆత్మకూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో యువత, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లలకు మ్యూజికల్‌ చైర్స్‌, పెద్దలకు కోలాటం, కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. జెవివి నాయకులు కె.ఆదినారాయణ మాట్లాడుతూ 15 ఏళ్లుగా గ్రామంలో సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి వాటివల్ల సుహృత్‌భావ వాతావరణ ఏర్పడుతుందని చెప్పారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సర్పంచ్‌ బి.నాగిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బి.లింగయ్య, సిహెచ్‌.రాయపరెడ్డి, పిఇటి కె.మంగయ్య, జెవివి నాయకులు కె.రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్లో కౌన్సిలర్‌ వాసిరెడ్డి లింగమూర్తి, తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, ఆయన భార్య అయిన శివశక్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ లీలావతి ప్రదానం చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ మ బహుమతిగా ఫ్రిడ్జ్‌, ద్వితీయ బహుమతిగి వాషింగ్‌ మిషన్‌, తృతీయ బహుమతిగా మిక్సీ, నాలుగో బహుమతిగా సీలింగ్‌ ఫ్యాన్‌, ఐదవ బహుమతి ఐరన్‌ బాక్స్‌ అందించారు. చుక్కల ముగ్గు విభాగంలో వి.నాగజ్యోతి, డి.శైలజ, కె.దుర్గా దేవి, కె.లీలావతి, జి.కావేరి మొదటి ఐదు స్థానాల్లో నిలవగా ఆర్ట్‌ ముగ్గులు విభాగంలో ఎ.ప్రణీత, ఇ.శ్రీదేవి, జి.రజిని, ఎం.రాజేశ్వరి, దుర్గా భవాని మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. విష్ణుకుండి నగర్‌ ప్రత్యేక ముగ్గుల పోటీల్లో డి.భానులక్ష్మి, జి.నాగమణి, హేమరోపతి, రాఘవేంద్ర గెలుపొందారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహ బహుమ తులనూ అందించారు. న్యాయ నిర్ణేతలుగా చితిరాల వల్లి, జవ్వాజి సువర్ణలక్ష్మి, కజ్జయం విజయలక్ష్మి వ్యవహరించారు. కౌన్సిలర్‌ వాసిరెడ్డి లింగమూర్తి దంపతులతో పాటు ఐఎఎస్‌ అకాడమీ ఎమ్‌డి పారా లక్ష్మయ్య, జి.వెంకయ్య, పి.నాగేశ్వరరావు, సిహెచ్‌ కోటేశ్వరరావు, వి.పేరయ్య, ఎం.అంజయ్య, జి.చంద్రశేఖర్‌, న్యాయవాదులు రామకోటేశ్వరరావు, జ్ఞానేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ వి.హనుమంతరావు, మిలటరీ వెంకట్రావు, పివీ సురేష్‌బాబు, షమీంఖాన్‌, ఆయుబ్‌ఖాన్‌, దస్తగిరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : మండలంలోని రెంటపాళ్లలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లకీëనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ జిల్లా అధ్యక్షులు గాదె వెంటేశ్వరావు అందించారు. ఈ సందర్భంగా అతిథులకు స్వాగతం పలుకుతూ టిడిపి-జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నాయకులు ఎం.రామచంద్రరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️