కుష్టు వ్యాధి తగ్గుముఖం

Feb 4,2024 21:17

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌ : ‘1983లో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఎపి) ప్రారంభమైంది. నాటి నుంచి లెప్రసీ వ్యాధి బాధితులను తగ్గించడానికి కృషి జరుగుతోంది. జాతీయ ఆరోగ్య విధానం 2002 ప్రకారం జాతీయ స్థాయిలో ప్రతి పది వేల మందిలో ఒకరి కంటే తక్కువ మందికి వ్యాధి ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించి అమలు చేస్తున్నాం. పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా కుష్టువ్యాధి తగ్గుముఖం పట్టింద’ని జిల్లా హెచ్‌ఐవి, లెప్రసీ నియంత్రణ అధికారి ఎ.శ్యామ్‌కుమార్‌ తెలిపారు. ఈ వారం తనను కలిసిన ‘ప్రజాశక్తి’కి ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు…

ప్రస్తుతం జిల్లాలో ఎంతమంది కుష్టు రోగులు ఉన్నారు.?

ప్రస్తుతం జిల్లాలో 215 కుష్టు రోగులు ఉన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఎల్‌సిడిసి పేరిట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. స్పర్శ, ఆశా వర్కర్లతో సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డిసెంబర్‌ 27 నుంచి జనవరి 14 వరకు చేపట్టిన ఎల్‌సిడిసిలో 33 వ్యాధిగ్రస్తులను గుర్తించాం. వారు క్రమం తప్పకుండా వైద్యులు పర్యవేక్షణలో మందులు వాడుతున్నారు.

ఈ ఏడాదిలో మీ కార్యాచరణ ఏమిటి.?

ఈ ఏడాదిలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ కార్యక్రమంలో పంచాయతీ, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కుష్టు వ్యాధి పట్ల ఉన్న అపోహలపై అవగాహన కల్పిస్తున్నాం. స్పర్శ లేని మచ్చలు, ఉబ్బిన నరాలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలి. పరీక్షలు చేసి, వ్యాధిని గుర్తిస్తే మందులు అందిస్తున్నారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో రోగుల వృద్ధి ఏ విధంగా ఉంది.?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రోగుల సంఖ్య తగ్గుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 2022లో 196 మంది రోగులను గుర్తిస్తే, 2023లో ఆ సంఖ్య 158కి పరిమితమైంది. గుర్తించిన రోజు నుంచి రోగులకు వైద్యంతో పాటు మందులు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. మల్టీబాసిల్లరీ కేసులు 12-18 నెలలు, పౌసిబాసిల్లరీ కేసులు 6 -9 నెలలు మందులు వాడాలి. వైకల్య కేసులకు శస్త్రచికిత్స, అర్హులైన వారికి పింఛను రూ.3వేలు చొప్పున ప్రతినెలా అందిస్తున్నార.

రోగుల ఇంట్లో చిన్నపిల్లలు, ఇతర సభ్యుల పరిస్థితి ఏమిటి.?

కుష్టువ్యాధిగ్రస్తుల ఇళ్లలో చిన్నపిల్లలు, ఇతరులకు కూడా నివారణ చర్యలో భాగంగా మందులు అందిస్తాం. వారిలో కూడా లక్షణాలు ఉంటే గుర్తించి మందులు అందిస్తున్నాం.

నయం కావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

దేశంలో కుష్టు వ్యాధి ప్రాబల్యం పది వేల జనాభాకు 0.4గా ఉంది. ప్రతి ఏటా 14 ఏళ్లలోపు చిన్నపిల్లల్లో 6.8 శాతం ఈ వ్యాధి వ్యాపిస్తోంది. దీనివల్ల పిల్లలు జీవితాంతం అంగవైకల్యంతో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి పిల్లలకు సంక్రమించకుండా, కుష్టు వ్యాధి కలిగిన వారికి వ్యాధి త్వరగా తగ్గడానికి మందులు క్రమం తప్పకుండా వినియోగించాలి. స్వీయ రక్షణతో వ్యాధిని త్వరగా తగ్గించే చర్యలు తీసుకోవచ్చు. వైకల్యం వృద్ధి చెందకుండా నిరోధించడం కోసం కుష్టు వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, మెరుగైన శస్త్ర చికిత్స చేయడం మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. అప్పుడే లెప్రసీ వ్యాధి నిర్మూలన కోసం చేస్తున్న కృషి ఫలిస్తుంది.

➡️