కొత్త పనులకు నిధుల్లేవు..!

Jan 31,2024 00:32

మాట్లాడుతున్న కత్తెర హెనీ క్రిస్టినా
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లా పరిషత్‌ నిధులతో చేపట్టి పనులకు సంబంధించి పురోగతిపై ఆయా శాఖలు నివేదిక ఇవ్వాలని అధికారులను జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా కోరారు. మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా అధ్యక్షతన ప్రణాళిక-ఆర్థిక అంశాలు, గ్రామీణాభివృద్ధి, విద్య-వైద్యం, పనులకు సంబంధించిన నాలుగు సమావేశాలు నిర్వహించారు. జెడ్పీ నుండి దాదాపు రూ.5 కోట్ల విలువైన పనులు మంజూరు చేశామని, అయితే అవి ఏయే దశల్లో ఉన్నాయో తెలియదన్నారు. కావున పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇతర శాఖలు ప్రగతి నివేదిక ఇవ్వాలన్నారు. పనులకు సంబంధించిన స్థాయి సంఘంలో పలువురు జెడ్పీటిసిలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు. మేడికొండూరు జెడ్పీటీసీ మాట్లాడుతూ మండంలో ఏడాది క్రితం చేసిన పనులకు ఇంత వరకూ బిల్లులు చెల్లించలేదని, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. దీనిపై ఛైర్‌పర్సన్‌ స్పందిస్తూ ఆర్థిక సంఘం నిధులు వచ్చాక విడుదల చేస్తామని చెప్పారు. ఫిరంగిపురం జెడ్పీటీసీ మాట్లాడుతూ గుండాలపాడులో ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లటానికి కాల్వ దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ సమస్యను నాలుగు సమావేశాల నుండి అడుగుతున్నామన్నారు. చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ నిధులు సమస్య ఉందని, పంచాయతీరాజ్‌ ద్వారా సాధ్యమవుతుందేమోనని పరిశీలించాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఇని కోరారు. పలువురు జెడ్పీటీసీలు కొత్త పనులు మంజూరు చేయాలని కోరగా ఈ ఏడాది ఇప్పటికే బడ్జెట్‌కు మించి పనులు ఇచ్చామని, కొత్త పనులు ఇవ్వటానికి నిధులు లేవని అన్నారు. అంతే కాకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉందని, కొత్త పనులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపడతామని చెప్పారు. ఇటీవల జెడ్పీ నిధులతో పదో తరగతి విద్యార్థులకు అందచేసిన స్టడీ మెటీరియల్‌పై విద్యార్థుల స్పందనను జెడ్పీ చైర్‌పర్సన్‌ డిఇఒలను అడిగి తెలుసుకున్నారు. డిఇఒలు విద్యార్థులకు ఉపయోగంగా ఉందని చెప్పారు. గత జెడ్పీ జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయించిన విధంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు నెల ముందు అల్పాహారం అందచేస్తామని ఆమె ప్రకటించారు. 7వ స్థాయి సంఘంలో సభ్యురాలైన దాచేపల్లి జెడ్పీటీసీ ఎం.కృష్ణకుమారి స్థానంలో ఆమె భర్త ప్రకాష్‌రెడ్డి సమావేశానికి హాజరవడం చర్చనీయాంశమైంది. 4వ కమిటీ కోరం లేక వాయిదా పడింది. వ్యసాయంపై స్థాయి సంఘ సమావేశం జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.నర్సిరెడ్డి, తెనాలి జెడ్పీటీసీ పి.ఉమాప్రణతి అధ్యక్షతన, స్త్రీ శిశు సంక్షేమంపై వైస్‌ చైర్‌పర్సన్‌ బి.అనురాధ అధ్యక్షతన సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి.

➡️