కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 11,2024 00:09
తమ సమస్యల

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరింది. పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద మున్సిపల్‌ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, గతంలో మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వర్రె గిరి బాబు, శివకోటి అప్పారావు, సింగంపల్లి సింహాచలం, ద్రౌపతి శ్రీను, వేలాపు శివ, భవాని, ముత్యాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం గొల్లప్రోలు నగర పంచాయతీ కార్మి కులు కంచాలు మోగిస్తూ నోటిలో గడ్డి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు కె.చిన్న, వర్కర్స్‌ యూనియన్‌ నాయ కులు అల్లం రాజు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల పట్ల మొండివైఖరి విడనాడాలన్నారు. కనీస వేతనం అమలు చేయాలని, పర్మినెంట్‌ చేయాలని, చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రమణ, యేసమ్మ, సత్యవతి, మరిడియ్య, రాజమోహన్‌, లోవబాబు, పోలమ్మ, సింహాచలం, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ స్థానిక నగరపాలక సంస్థ మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులు భైఠాయించారు. అప్కాస్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మున్సిపల్‌ కాలనీలు ఏర్పాటు చేయాలని, మస్తార్ల కార్యాలయం వద్ద పని వేళల బోర్డు, మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నినదించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బొబ్బిలి శ్రీనివాసరావు, సుబ్బలక్ష్మి, నిమ్మకాయల విక్కి, ఆరుద్ర, బంగారు రాజేష్‌, చక్రి, నిమ్మకాయల ఈశ్వరరావు నాయకత్వం వహించారు.

➡️