కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Jan 17,2024 21:25
ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌

ఫొటో : మాట్లాడుతున్న డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌
కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జగనన్నకు చెబుదాం అని కోటి సంతకాల కార్యక్రమాన్ని బుధవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన అంగన్‌వాడీల శిబిరం వద్ద డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ తొలి సంతకం చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాటం భావితరాలకు దిక్సూచి అని, ఈ పోరాటం జరగబోయే పోరాటాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 37రోజులు ఐక్యంగా పోరాటం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు డిమాండ్లను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమని, అంగన్‌వాడీలు అడిగేవి ప్రభుత్వం పరిష్కరించలేనంత ఏమీలేవని న్యాయమైన డిమాండ్లే అని తెలియజేశారు. పోరాటంలో వెనకడుగు వేయకుండా సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంగన్‌వాడీల పోరాటానికి అండ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌ రావు హాజరై మాట్లాడుతూ 37 రోజులుగా పోరాటం చేస్తున్నామని ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసినందున, ఉద్యమం మరింత బలపడిందని సమ్మెకు కారణం ప్రభుత్వమేనని ముందుగానే అనేకసార్లు అంగన్‌వాడీ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరామని ప్రభుత్వం స్పందించకుండా ఉన్నందునే సమ్మె నోటీసు ముందుగానే ఇచ్చామని సమ్మెలోకి వెళతామని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందని సమ్మె చట్టబద్ధమైందని ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకుండా అంగన్‌వాడీలపై ప్రభుత్వం రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపారు. ఎస్మా ఉపయోగించి పోరాటాలు అణిచివేయాలని చూస్తుందని, ఉద్యోగాలు తీసేస్తామని, నోటీసులు ఇస్తుందని మరొక పక్క అధికారులు అధికార పార్టీ నాయకులతో ఒత్తిడి తెస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇన్ని రకాలుగా అంగన్‌వాడీ హెల్పర్లను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి గతంలో జయలలిత ఉన్నప్పుడు ఇలాగే కలంపోటుతో ఉద్యోగాలు పీకేయడంతో తరువాత ఎన్నికలలో అక్కడ ప్రజలు అధికారం నుండి ఆమెను ఇంటికి పంపారని కోర్టుకు వెళ్లి అందరూ ఉద్యోగాలు తెచ్చుకున్న చరిత్ర ఉందని, అంగన్‌వాడీలను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కించినందున ఆయన కూడా అధికారానికి దూరమై పోయాడని, చరిత్రను ఒకసారి ముఖ్యమంత్రి తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీలకు సిపిఎం, సిఐటియు అండగా ఉంటుందని, పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడితే ఈ ప్రభుత్వం కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య, టి.మాల్యాద్రి, వై.కృష్ణమోహన్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎం.రమాదేవి, బి.శ్రీదేవి, జెవివి నాయకులు పి.జానకిరామ్‌, హరినారపరెడ్డి, మాజీ ఎంఇఒ కల్లయ్య, సిపిఎం నాయకులు జి మధుసూదన్‌ రావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రఘురావమ్మ, విజయలత, వజ్రమ్మ, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️