కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 8,2024 22:09

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: సమగ్రశిక్షలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ను రెగ్యులర్‌ చేయాలని,కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె సోమవారం కొనసాగింది. కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసన శిబిరంలో ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. పోరాటానికి టిడిపి నియోజకవర్గ ఇంచార్జి అతిధి గజపతిరాజు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించి సమ్మెను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. సమ్మెకు జనసేన నాయకులు పాలవలస యశస్వి పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగుల జెఎసి నాయకులు గురువులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️