కొప్పుల వెలమ అభ్యున్నతికి కృషి : ఎంఎల్‌ఎ

సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

కొప్పుల వెలమ సంఘీయుల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎంఎల్‌ఎ ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్‌లో రామన్న కోనేరు పక్కన కొప్పుల వెలమ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఎంపీ కోటగిరి శ్రీధర్‌, పలువురు ఎంఎల్‌ఎలు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ కొప్పుల వెలమల చిరకాల స్వప్నం సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు బిసిలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే నేడు వైసిపి ప్రభుత్వం అన్ని రంగాల్లో బిసిలకు పెద్ద పీట వేసి సముచిత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ గతంలో 136 బిసి కులాలకు కలిపి ఒకే కార్పోరేషన్‌ ఉండేదని, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే బిసి ఉప కులాలన్నింటికీ ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి, వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించిన వైసిపికి కొప్పుల వెలమ సంఘీయులు అండగా ఉండాలని కోరారు. బిసి సెల్‌ అధ్యక్షుడు ఘంటా ప్రసాద రావు మాట్లాడుతూ కొప్పుల వెలమ సంఘానికి సుమారు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని మంజూరు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించిన ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్‌, జెడ్‌పి ఛైర్మన్‌ ఘంటా పద్మశ్రీ, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు, ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు.

➡️