కోడికత్తితో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

యువకులతో మాట్లాడుతున్న కెవిపిఎస్‌ నేత చిరంజీవి తదితరులు

ప్రజాశక్తి- వడ్డాది

బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన దళిత యువకు బుర్ర తేజపై కోడి కత్తితో దాడి చేసి గాయపర్చిన అగ్ర కులానికి చెందిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పినపాత్రుని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. వడ్డాది గ్రామంలో బాధితుడు తేజ కుటుంబాన్ని గురువారం చిరంజీవి, సాంబశివరావు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడిసినా నేటికీ దళితులపై, మహిళలపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఇటువంటి ఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితడు తేజ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. అట్రాసిటీ కేసుల్లో అరెస్టు అవుతున్న వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం సరికాదని, దానిని రద్దు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం అండగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బుసి కోటి తదితరులు పాల్గొన్నారు.

➡️