క్లాప్‌ డ్రైవర్ల హక్కుల సాధనకు పోరాటం

జివిఎంసి క్లాప్‌ డ్రైవర్లు, లోడింగ్‌ కార్మికుల

సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు

ప్రజాశక్తి – గాజువాక : జివిఎంసి క్లాప్‌ డ్రైవర్లు, లోడింగ్‌ కార్మికుల సంపూర్ణ హక్కుల సాధనకు పోరాటం తప్పదని, కార్మికుల న్యాయపోరాటానికి భవిష్యత్‌లోనూ సిపిఎం అండగా ఉంటుందని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు స్పష్టం చేశారు. బుధవారం గాజువాక జోన్‌ పరిధిలోని క్లాప్‌ డ్రైవర్లు, లోడర్‌ కార్మికుల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టుబానిసలను చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూనుకుందని దుయ్యబట్టారు. రైతులు, ప్రజల త్యాగాలతో సాధించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, దీంతో విశాఖ అభివృద్ధికి విఘాతంతోపాటు, వేలాది మంది కార్మికులు, నిర్వాసితులకు నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రానికి, ప్రభుత్వరంగ సంస్థలకు, కార్మికులకు ద్రోహం చేస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి హాని చేస్తున్న బిజెపిని నిలదీయాల్సిన అధికార వైసిపి, విపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు కార్మికుల, ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా బిజెపితోనే అంటకాగడం దుర్మార్గమన్నారు యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి వెంకటరెడ్డి, క్లాప్‌ డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షులు సుగుణాకరరాజు, ప్రధాన కార్యదర్శి ఒ.సురేషు, సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం రాంబాబు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్మిక హక్కులకు విఘాతం కలుగుతూనే ఉందని, సమ్మెలు, పోరాటాలు చేస్తే నిర్బంధాలు కొనసాగిస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికల్లో అధికార వైసిపితోపాటు ప్రధాన విపక్షాలు టిడిపి, జనసేన, బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలని కార్మికులను కోరారు. వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలిచే కార్మిక నేతలను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మధు, రాంబాబు, గిరి, పైడ్రాజు, గొలగాని అప్పారావు, నాగరాజు, మీనాక్షి ,చిన్నారావు, హేమకుమార్‌, 19 వార్డుల కార్మికులు, క్లాప్‌డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షులు, పాల్గొన్నారు.

క్లాప్‌ డ్రైవర్లు, లోడర్‌ కార్మికుల సర్వసభ్య సమావేశం

➡️