గంతలు కట్టుకొని అంగన్‌వాడీల నిరసన

Jan 12,2024 22:19
ఫొటో : గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఫొటో : గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
గంతలు కట్టుకొని అంగన్‌వాడీల నిరసన
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు ఎర్ర చీరలు కట్టుకొని కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకొని శుక్రవారం నిరసన తెలియజేశారు. శిబిరం వద్దకు యుటిఎఫ్‌, జన విజ్ఞాన వేదిక నాయకులు వచ్చి వారి మద్దతును తెలియజేశారు. అనంతరం సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ అంగన్‌వాడిల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలో 32 రోజులుగా సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని అంగన్‌వాడీలు కోరుతున్నారని, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని, గ్రాడ్యుటి పెన్షన్‌ విధానం అమలు చేయాలని, అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నదని అందువల్ల అంగన్‌వాడీల పోరాటం రోజురోజుకు ఉధృతమవుతుందన్నారు. వీరి పోరాటానికి రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా ఆందోళన చేయటానికి ముందుకొస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం నాలుగో విడత జరిగే ప్రభుత్వ చర్చలలో అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అలా జరగని పక్షంలో సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టి.మాల్యాద్రి, యుటిఎఫ్‌ నాయకులు కిలారి వెంకటేశ్వర్లు, మాధవరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు పి.జానకి రామ్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️