గర్జించిన అంగన్‌వాడీలు

Jan 3,2024 21:02

సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తాత్సారం చేయడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారంతా భగ్గుమన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఎదుట అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన వివిధ మండలాల నుంచి అంగన్వాడీలు వేలాదిగా తరలివచ్చి బైఠాయించారు. శాంతి యుతంగా సమ్మె చేస్తున్న తమపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ నోటీసులు పంపడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, నడిరోడ్డుపైనే భోజనాలు చేస్తూ నిరసన కొనసాగించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగింది. అంగన్వాడీలకు సిపిఎంతో పాటు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌవాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, అధ్యక్ష కార్యదర్శులు పి.సరళారాణి, గంటా జ్యోతి, ఆధ్వర్యంలో బుధవారం జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ స్థానిక పాత బస్టాండు నుండి ప్రధాన రహదారిపై జిల్లా కలెక్టరేట్‌ వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఖరుకు పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ మళ్లించారు. ఈ సందర్భంగా సిఐటియు, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి రాకమునుపు అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయలేకపోగా, న్యాయంగా వారు చేస్తున్న సమ్మెను అణచివేయాలని చూడడం దారుణమన్నారు. అంగన్వాడీ కేంద్రాలను అనర్హులచే బలవంతంగా తెరిపించి కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, ఈనెల 5లోగా విధులకు హాజరు కాకపోతే అంగన్వాడీలపై చర్యలు చేపడతామని జిల్లా అధికారులచే బెదిరించడం వంటి చర్యలు ప్రభుత్వ దురహంకారానికి, దుర్నీతికి అద్దం పడుతున్నాయని అన్నారు. పంతానికి పోయి ప్రభుత్వం అంగన్వాడీలపై చర్యలకు పాల్పడితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు ఒక్కటై పోరాటాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని అంగన్వాడీ నాయకత్వంతో చర్చలు జరిపి కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు.గర్భిణులు, బాలింతలు, సున్నా నుండి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్ల అనేక సేవలందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని, నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, ఆర్టీసీ, రైల్వే ధరలు పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగలేదని అన్నారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు హెల్పర్లకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు వివిధ రకాల యాప్‌లు తెచ్చారు. ఫోన్లు పని చేయడంలేదన్నారు. ఇందుకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదన్నారు. ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో నెట్‌ సిగల్‌ ఉండడంలేదని, దీనివల్ల అంగన్వాడీలు మానసిక వత్తిళ్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సమస్యల పరిష్కారానికి కేంద్రాలను మూసివేసి నిరవధికంగా సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు అమరవేణి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.రమణారావు వై.మన్మధరావు, నాయకులు వి.ఇందిర, జి.వెంకటరమణ, రైతు సంఘం నాయకులు కొల్లి గంగునాయుడు, రెడ్డి వేణు, ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, బొత్స లక్ష్మి, పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు అలివేలు, గౌరీమణి తో పాటు జిల్లాలోని అన్ని సెక్టార్ల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️