గాజాపై ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా నిరసన

నిరసన తెలుపుతున్న జన సాహితి ప్రతినిధులు

ప్రజాశక్తి-అనకాపల్లి

గాజాకు మద్దత్తుగా ప్రపంచవ్యాపితంగా ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అనకాపల్లి జిల్లా జనసాహితి ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్‌ వద్ద ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా రామచంద్రా థియేటర్‌ నుంచి యుద్ధ వ్యతిరేక, సామ్రాజ్య వ్యతిరేక, ఇజ్రాయిల్‌ వ్యతిరేక నినాదాలతో ఊరేగింపుగా జనసాహితి సభ్యులు నెహ్రూ చౌక్‌ వద్దకు చేరారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి జనసాహితి జిల్లా అధ్యక్షులు శివాజీ రావు మాట్లాడుతూ ఇప్పటికీ మూడు నెలలుగా గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లలో ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడుల వలన వేలాది పిల్లలు, పౌరులు మరణించారని, హాస్పిటల్స్‌ మీద బాంబులు వెయ్యడం వలన వైద్యం అందక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. పాలస్తీనా ప్రజలకు అండగా ప్రపంచ ప్రజానీకం నిలబడాలని పిలుపునిచ్చారు. జనసాహితి సభ్యులు జగదీష్‌ మాట్లాడుతూ అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి సామ్రాజ్యవాద దేశాలు తమ ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మీద దాడులు చేయిస్తుందని, దీనిని ప్రపంచ దేశాలు ఖండించాలన్నారు. మరో జనసాహితి సభ్యులు పెంటాద్రిరావు మాట్లాడుతూ తక్షణం ఇజ్రాయెల్‌ పాలస్తీనాపై దాడులు ఆపాలని, బయటనుంచి ఆహారం, వైద్య సహాయం అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాస్త్రి, రంగబాబు, ప్రసాద్‌, బి.శ్రీను, బలరాం తదితరులు పాల్గొన్నారు.

➡️