గిరిజన హక్కులు తెలుసుకోవాలి

ప్రజాశక్తి – బొబ్బిలిరూరల్‌ : అభివృద్ధిలో వెనుకబడిన గిరిజనులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకర్రావు అన్నారు. గురువారం మండలంలోని కాసింధోర పంచాయతీ దొంగరువలస, కొత్తవలస గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను ఆది నుండి సమస్యలు వెంటాడుతున్నాయని వారికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని అవి వారు వినియోగించుకోవాలని చెప్పారు. వారి హక్కులు, వారి బతుకులు బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌టి కమిషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. గిరిజన సమస్యలపై ఎస్‌టి కమిషన్‌కు ఒక్క ఉత్తరం రాసినా స్పందిస్తామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అటవీ హక్కుల పథకం ద్వారా రాష్ట్రంలో 2.25 లక్షల మంది గిరిజనులకు పట్టాలు మంజూరు చేశామన్నారు. గిరిజనులు బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. మన అభివృద్ధికి మనమే పాటు పడాలన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక, రహదారి పనులకు అధికారులను అదేశిస్తామన్నారు. జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటు చెయ్యాలని గిరిజన సంఘం నాయకులు కోరడంతో ఈ జిల్లా మైదాన ప్రాంతంలో ఉన్నందున ప్రయత్నిస్తానన్నారు.ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చెయ్యాలితమ గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చెయ్యాలని మండలంలోవున్న గిరిజన తండా వాసులు చైర్మన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వలసలు వచ్చిన గిరిజనులకు పంచాయతీల్లో కలపాలని ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అప్పలరాజు దొర కోరారు. ఐటిడిఎ ఏర్పాటు చెయ్యాలని, పూర్తి స్థాయిలో పట్టాలు మంజూరు చేయాలని, గ్రామంలో పెత్తందార్లకు భూములున్నాయని, గ్రామానికి శ్మశాన వాటికకు స్థలం మంజూరు చెయ్యాలని, షికారుగంజి గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చెయ్యాలని రైతు కూలి సంఘం నాయకులు వర్మ కోరారు. 75 ఏళ్ళుగా గిరిజన బతుకులు మారలేదని ఇప్పటికి డోలీల మోత తప్పడం లేదని గిరిజన రోడ్లు వెయ్యాలని మండలంలోని సి.హెచ్‌ బొడ్డవల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాల గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడం లేదని వెంటనే మంజూరు చెయ్యాలని గిరిజన జెఎసి నాయకులు సీతారాం కోరారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి ఏడు మండలాల వివిధ శాఖ అధికారులతో సమీక్ష చేశారు.వినతులు పరిష్కరిస్తాం : ఆర్‌డిఒ ఈ సమావేశంలో వచ్చిన వినతులు రెవెన్యూ, అటవీశాఖ ఆధ్వర్యంలో పరిశీలించి పరిస్కారానికి చర్యలు తీసుకొంటామని, ఇప్పటికే షికారుగంజిలో నివసిస్తున్న గిరిజనుల నివాస గృహాలకు భూమిని సేకరించామని ఆర్‌డిఒ సాయిశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ డి.రాజేశ్వరావు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️