గెలుపే లక్ష్యంగా పనిచేయండి

సిపిఎం కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర నేత వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రాజవొమ్మంగిలో శనివారం ఆయన సిపిఎం కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సిపిఎం మండల నాయకులు మళ్ళిన రమేష్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడారు. అధికార వైసిపి, టీడీపీ-జనసేన-బిజెపి కూటమి అభ్యర్థుల కంటే సమర్థవంతమైన అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని, రంపచోడవరం నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగిరేల ప్రతి కార్యకర్త సైనికుల వలే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే విలీన నాలుగు మండలాలు, రంపచోడవరం ఏడు మండలాల్లో సిపిఎంకు విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. సిపిఎం పోలవరం నిర్వాసితుల సమస్యలపైనా, రంపచోడవరం ఏడు మండలాల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. ప్రజలు సిపిఎంను గెలిపించాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోండ్ల సూరిబాబు, కుంజం జగన్నాథం, పి.రామరాజు, దొరబాబు, కె.రాజబాబు, పాండవులు సత్యనారాయణ, జతరాజు, పి.పాపారావు, జనమూరి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️