గోడలపై రాతలకు అనుమతి లేదు

Mar 19,2024 21:29

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ :ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని, వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హౌర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించొద్దని ఆదేశించారు. హైవేలు, ప్రధాన రహదారుల పక్కన ఇప్పటి వరకు ఉన్న హోర్డింగ్‌లను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున నూతన అనుమతులు జారీ చేయరాదని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయడంలో ఎటువంటి అలసత్వం వహించరాదని అన్నారు. జిల్లా సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణ ఉండాలని, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపర్చడం, ఎలక్ట్రానిక్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సివిజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. మద్యం విక్రయాలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇవిఎంల రాండమైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌, సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలో కల్పనా కుమారి, సి.విష్ణుచరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ శోబిక, ఇన్‌ ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, పార్వతీపురం, పాలకొండ ఆర్‌డిఒలు కె.హేమలత, ఎ.వెంకట రమణ, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, పలువురు నోడల్‌ అధికారులు, వివిధశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.స్టిక్కర్లు తొలగింపుపార్వతీపురంటౌన్‌ : పట్టణంలో 41,42,43 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఇళ్లపై ఉన్న రాజకీయ నాయకుల స్టిక్కర్లు, పోస్టర్లు తదితర అంశాల తొలగింపును సెక్టార్‌ అధికారి, ఐ సి డి ఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారి బి శ్రీనివాస రావు మంగళవారం చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు.

➡️