గ్రామాన్ని ఖాళీ చేసే పరిస్థితి తేవొద్దు

Mar 20,2024 21:16

 ప్రజాశక్తి-భోగాపురం : గ్రామానికి ఆనుకొని ఉన్న మూడు క్వారీలతోనే ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు కొత్తగా మరొకటి ఏర్పాటు చేసి గ్రామాన్ని ఖాళీ చేసి ెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావద్దని అధికారులకు రామంచంద్రపేట గ్రామస్తులు వేడుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగంగా జిఎమ్‌ఆర్‌ సంస్థ రామచంద్రపేట గ్రామానికి ఆనుకొని కొత్తగా క్వారీ ఏర్పాటుకు అనుమతులు పొందింది. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిధిగా జిల్లా రెవెన్యూ అధికారి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను చెప్పాలని గ్రామస్తులను ఆమె కోరారు. గ్రామస్తులు దుక్క రమణ, కోలా రామసూరి, సుగ్గు పోలిరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఆనుకొని ప్రస్తుతం మూడు క్వారీలు ఉన్నాయన్నారు. బాంబుల పేలుళ్లతో ఇప్పటికే గ్రామస్తులు నరకం చూస్తున్నారని తెలిపారు. ఇళ్లకు బీటలు వారుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా మరో క్వారీని ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. అంతేకాక ఇప్పుడు ఏర్పాటు చేయనున్న క్వారీ పాఠశాలకు ఆనుకొని ఉన్నందున విద్యార్ధులు కూడా చాలా ఇబ్బందులు పడతారని తెలిపారు. హైకోర్టు న్యాయవాది సతీష్‌, సామాజిక కార్యకర్త రామారావు మాట్లాడుతూ ఇక్కడ క్వారీ ఏర్పాటు చేయడం గ్రామస్తులకు ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. అంతేకాక సుమారు రూ.190 కోట్లు విలువైన క్వారీయింగ్‌ చేసి కేవలం మూడు నాలుగు లక్షల సిఎస్‌ఆర్‌ గ్రాంట్‌ ఇస్తామనడం దారుణమని అన్నారు. అంతేకాక ఈ ప్రాంత రహదారులు కూడా దెబ్బతింటాయన్నారు. గ్రామ వాలంటీర్లు ఇప్పిలి గోవిందు, నొడగల రమణ, పిట్ట బాలాజి మాట్లాడుతూ గతంలో గ్రామానికి ఆనుకొని ఉన్న క్వారీ మూసి ఉండడంతో అక్కడ సుమారు కోటి రూపాయలతో గ్రామ సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్‌, రైతుభరోసా కేంద్రం నిర్మిస్తామని తెలిపారని, క్వారీ ప్రారంభించిన తరువాత వీటిని ప్రారంభించ కుండా కోర్టు నుంచి స్టే తెచ్చి నిలుపుదల చేశారని అన్నారు. యువకులు దుక్క రాము, దుక్క నర్సిమ్మ, నీలాద్రి బాలక్రిష్ణ, దువ్వు బంగార్రాజు మాట్లాడుతూ క్వారీల ప్రభావంతో తాగునీరు కలుషితమైందని, అనేక మంది కిడ్నీల సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. ముఖ్యంగా క్వారీల నుంచి వస్తున్న దూళితో చిన్న పిల్లల్లో, పెద్దల్లో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. పెదకొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన సూరాడ చిన్నారావు మాట్లాడుతూ మా గ్రామనికి వెళ్లే రహదారిలో క్వారీతో చాలా అవస్థలు పడుతున్నామన్నారు. త్వరలో గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ అనిత మాట్లాడతూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులకు తెలిపారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సిఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. సమావేశంలో తహశీల్దారు శ్యామ్‌ ప్రసాద్‌, ఎంపిడిఒ చంద్రకళ, డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరావు, ఎస్‌.ఐ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️