గ్రామాల్లో టిడిపి బైక్‌ ర్యాలీ

Feb 3,2024 20:54

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. 225 మోటార్‌ బైక్‌లపై యువత ర్యాలీగా వావిలిపాడు నుంచి చినగుడిపాల, ఎన్‌కెఆర్‌పురం, కుంపల్లి, కృష్ణరాయుడుపేట బల్లంకి, బాణాది నల్లబెల్లి వరకు సాగింది. బైక్‌ ర్యాలీకు ముందు వరుసలో గొంప కృష్ణ సైకిల్‌పై ర్యాలీ చేశారు. నల్లబెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చేది టిడిపి, జనసేన ప్రభుత్వమేనన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిని తుంగలో తొక్కేశా రన్నారు. అధికార పార్టీ నాయకులు దాచుకోవడం, దోచుకోవడానికి ఈ నాలుగున్నర సంవత్సరాలు సరిపోయిందని ఎవరైనా అడిగితే తప్పుడు కేసులు పెట్టి హింసించడమే తప్ప స్వతంత్రంగా బ్రతికే అవకాశం లేకుండా నిరంకోస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వడంతో పాటు చదువుకున్న పిల్లలందరికీ అమ్మబడి మంజూరు చేస్తామన్నారు. భూమున్న ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 20వేలు నగదు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ టిడిపి మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతి, విశాఖపట్నం సమన్వయకర్త జనపరెడ్డి ఈశ్వరరావు, మండల ఐటిడిపి అధ్యక్షుడు సేనాపతి గణేష్‌, టిడిపి నాయకులు సిరికి రమణ, గొర్లె నాగరాజు, మంచిన అప్పలసూరి, 29 పంచాయతీలకు చెందిన టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

➡️