చంద్రబాబు పాపం పండింది : రాంబాబు

విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి రాంబాబు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలవరించటం చుస్తే చట్టం ముందు దోషులు ఎవరూ తప్పించుకో లేరనే విషయం తేటతెల్లమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ పేరుతో సుమారు రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై ఏపీ సిఐడి పోలీసులు కేసును నమోదు చేశారని గుర్తు చేశారు. ఎన్నో కేసుల నుండి చాకచక్యంగా తప్పించుకున్న బాబు నేడు సుప్రీం కోర్ట్‌ ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో బాబు తప్పించుకోలేక పోయారని అన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా ఆయన రిమాండ్‌ రిపోర్ట్‌, కేసులను సమర్థించారని, దీంతో బాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యిందని ఎద్దేవ చేశారు. ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కోర్ట్‌ తిరస్కరించడం టిడిపి శ్రేణులకు చెంపపెట్టన్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి, పేరుమోసిన లాయర్లు పెట్టి స్కిల్‌ స్కామ్‌ కేసునుండి తప్పించుకోవాలని ప్రయత్నించినా చట్టం నుండి చంద్రబాబబు తప్పించుకో లేకపోయారని అన్నారు. బాబు ఒక మోసగాడని, ఇప్పటికే అతని పాపం పండిందని విమర్శించారు. ఇంత జరిగినా బాబు దత్తపుత్రుడైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నోరు మేడపాకపోవటంలో అంతర్య ఏమిటని ప్రశ్నించారు. చట్టం ముందు పేదవాడైనా, కోటీశ్వరుడైనా ఒక్కటే నేడు సుప్రీం బెంచ్‌ ఇచ్చిన తీర్పుతో మరోసారి స్పష్టమైందని చెప్పారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం సిఎం జగన్‌కు గాని, ప్రభుత్వానికి గానీ లేదన్నారు. చంద్రబాబు చేసిన నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలనూ పోలీసులు పక్కాగా సేకరించారని, తప్పు చేసి తప్పించుకోవాలని చుస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుని అన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలనూ వెంటబెట్టుకుంటారని, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జు లను నియమించే స్థాయి ఆయనకుందని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఎవరితో కలసి వస్తారో రావాలని, ముందు కుప్పంలో గెలిచి రావాలని సవాలు విసిరారు. కేసులో క్వాష్‌ కాదని, ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబను క్వాష్‌ చేస్తారని ఎద్దేవ చేశారు. విజయవాడలో శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 206 అడుగుల భారీ విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమైందని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. మంత్రివెంట యార్డు చైర్మన్‌ పి.బాబురావు, సాంబశివరావు, నాగూర్‌ మీరాన్‌, సహారా మౌలాలి, ఎ.శివప్రసాద్‌, వెలుగురి శరత్‌బాబు ఉన్నారు.

➡️