చట్టాలపై అవగాహన ఉండాలి : సిఐడి డిఎస్‌పి

Jan 29,2024 21:05

ప్రజాశక్తి – కొమరాడ : గిరిజనులకు చట్టాలపై అవగాహన ఉండాలని సిఐడి డిఎస్‌పి డి.లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన గిరిజన హక్కులు, సాధికారితపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 35 తెగలు, ఆదివాసీలు 6 శాతం ఉన్నారన్నారు. కొంత మంది గిరిజనులు అవగాహనా లోపం వల్ల ఎవరితోనూ కలవలేరని, అలాంటి బెరుకు, భయం పోవాలని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వారి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గిరిజనులకు వ్యవసాయం, వ్యాపారం కోసం రుణాలను మంజూరు చేస్తాయని, వాటిని వినియోగించుకుని అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని తెలిపారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, చట్టాలపై అవగాహనా కల్పించడానికే ఈ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. తహశీల్దార్‌ భుజంగరావు మాట్లాడుతూ గిరిజనుల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించిందని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడాన్ని ఆర్టికల్‌ 17లో పొందుపర్చారని, 1955లో గిరిజనుల ఉన్నతికి పౌరహక్కుల చట్టం ఏర్పాటు చేశారన్నారు. 1989లో ఎస్‌టి చట్టం వచ్చిందని, వాటిపై గిరిజనులు అవగాహన పొందాలని తెలిపారు. ఎంపిడిఒ మల్లికార్జున మాట్లాడుతూ గిరిజనుల్లో మంచి నైపుణ్యాలున్నాయని, కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక వెనకబడిపోయారని తెలిపారు. వీరికి ఉచిత విద్య, వసతి, ఉపాధి వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వాలు తీర్చిద్దిద్దారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ అధికారి సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూడిశ సర్పంచ్‌ సోడి ఆనందరావు మాట్లాడుతూ చట్టాలపై అవగాహనా లేకపోవడం వల్ల గిరిజనులు వెనకబడిపోయారన్నారు. ఇలాంటి సమావేశాల వల్ల గిరిజనులకు అవగాహనా కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

➡️