చరిత్ర ఘనం… సమస్యలు అధికం

Mar 9,2024 21:36

 ప్రజాశక్తి – వీరఘట్టం :  విద్యాభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో అధిక శాతం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తుందో తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. అంతేకాక సర్కారు బడులను కార్పొరేట్‌ తరహాలో తీర్చుదిద్దామని చెబుతున్న పాలకులు మాటలకు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలుర)లో పరిస్థితికి పొంతనలేదు. ఈ పాఠశాలలో సమస్యలు కోకొల్లులగా ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగి ఈ పాఠశాల పరిస్థితి ప్రస్తుతం పరమ అధ్వానంగా ఉంది.మండల కేంద్రమైన వీరఘట్టం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలుర)లో ఆరో తరగతి నుండి పదో తరగతి 307మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలను 1950లో స్థాపించారు. అప్పట్లో ఆరు నుంచి పదో తరగతి వరకు సుమారు 1600 నుండి 1700 వరకు విద్యార్థులు విద్యను కొనసాగించడంతో రాష్ట్రంలో ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉన్నట్లు పూర్వపు విద్యార్థులు చెబుతున్నారు. ఇంత ప్రత్యేకత ఉన్న ఈ పాఠశాల ప్రస్తుత పరిస్థితిని చూస్తే హృదయవిదారకంగా మారింది. ఆరు బయట వంటలేవిద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు పాఠశాలలో వంట గదిలేక నిర్వాహకులు ఆరుబయటే వంటలు చేస్తున్నారు. లక్ష రూపాయల అంచనా వ్యయంతో వంటగది నిర్మించినప్పటికీ లోపల వంట చేసినప్పుడు చుట్టూ పొగ కమ్మడంతో నిర్వాహకులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆరుబయటే వంటలు చేయడం మొదలుపెట్టారు. ఎండైనా, చినుకైనా, గాలైనా విద్యార్థులకు వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూలకు చేరిన మరుగుదొడ్లువిద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల ఆవరణంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు ఆరు బయటకు వెళ్లి కాలకృత్యాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాఠశాల పక్కన ప్రధాన రహదారి ఉండడంతో ప్రతిరోజు వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏ విధమైన ప్రమాదవవార్త వినాల్సి వస్తుందోనని ఇటు ఉపాధ్యాయులు అటు విద్యార్థుల తల్లిదండ్రులు భయంతో కాలం వెలదీస్తున్నారు. ఏ విధమైన ప్రమాదం జరగక ముందే అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాలుపాఠశాల ఆవరణలోనే 2021లో రూ.కోటీ 60 లక్షలతో నాబార్డ్‌ నిధులతో 8 గదుల నిర్మాణ పనులు చేపట్టారు. కింద భాగంలో నాలుగు రూములు, పైభాగంలో నాలుగు రూములు నిర్మించారు. అయితే కింద నాలుగు రూముల ప్లాస్టింగు, గచ్చులు వేసినప్పటికీ కనీసం వైరింగ్‌ చేయకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతతో చీకట్లోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పాఠశాల పరీక్షా కేంద్రంగా గత కొంతకాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ విద్యుత్‌ సౌకర్యం అంతంత మాత్రమే. దీంతో విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన సమయంలో అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా పాలకులు, విద్యాశాఖ ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సమస్య లేని పాఠశాలగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

➡️