చీనీ రైతులు కుదేలు

ప్రజాశక్తి – సింహాద్రిపురం తమ పరిస్థితి దయనీయంగా మారిందని చీనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల నియోజవర్గంలోని సింహాద్రిపురం, తొండూరు, లింగాల, వేముల, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలాల్లో దాదాపు 20 వేల హెక్టార్లలో చీనీ పంట సాగులో ఉంది. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై జూన్‌, జూలై నాటికి ఏడగారు, గైరంగాల చీనీకాయల కోతలు ముగుస్తాయి. ఈ సీజన్‌లో ప్రతిరోజు మార్కెట్లో 500 టన్నుల 1000 టన్నుల వరకు విక్రయాలు జరుగుతాయి. అదేవిధంగా పులివెందుల మార్కెట్‌ స్థానికంగా తోటల వద్ద రైతులు మరో 500 టన్నుల కాయలను వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, నాగపూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు, రాజస్థాన్‌ రాష్ట్రాలకు తరలించేవారు. అయితే ఈ ఏడాది ఎండలు అధికమైనప్పటికీ ధరలు మాత్రం పెరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి కష్టపడినా.. పంటకు దిగుబడి వచ్చే సమయంలో ధరలు లేకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గడిచిన 20 రోజుల నుంచి పులివెందుల మార్కెట్లో టన్ను గరిష్టంగా రూ.18వేల నుంచి రూ.22 వేల లోపు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కాయలకు రవాణా, కోత కూలీలు, కమీషన్‌ అందులోనే చెల్లించాల్సి ఉంది.పులివెందుల మార్కెట్‌కు రాని కొత్త వ్యాపారులు.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పులివెందులలో చీనీ కాయల మార్కెట్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో సూటు, కమీషన్‌ లేకుండా చీనీ కాయల కొనుగోలు చేయాలని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజులకే అనివార్య కారణాలతో మూత వేశారు. మళ్లీ కొన్ని అనివార్య కారణాల వల్ల కమీషన్‌ ఆరు శాతం, తరుగు కింద టన్నుకు 20 కిలోలు తీసుకునేలా వ్యాపారస్తులు అంగీకరించడంతో కొనుగోళ్లు పునఃప్రారంభించారు. అయితే మార్కెట్లో స్థానిక వ్యాపారులతోనే వ్యాపారాలు జరుగుతుండడంతో ఆశించిన స్థాయిలో ధరలు వేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రముఖ కంపెనీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు రాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారస్తులు, ప్రముఖ కంపెనీలు వస్తేనే మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని చీనీ రైతులు కోరుతున్నారు.మహారాష్ట్ర కాయల ప్రభావం.. మహారాష్ట్రలో ఈ ఏడాది చీనీ కాయలు దిగుబడి అధికంగా ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈ కారణంగా మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి చీనీకాయల ఎగుమతి అధికంగా ఉన్నందున అనంతపురం మార్కెట్‌ సైతం పునఃప్రారంభం కాలేదు. ప్రతి ఏడాది ఇదే సమయంలో టన్ను రూ.35వేల నుంచి రూ.40 వేల వరకు ధరలు పలుకుతుండేవి. ఏడాది ధరలు పెరగక పోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తెగుళ్లతో మరోవైపు ఇబ్బందులు.. ఇటీవల కాలంలో చీనీ తోటలకు తెగుళ్లు అధికమయ్యాయి. వాటి నివారణకు క్రిమిసంహారక మందులు అధికంగా కొట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా పులుసు పురుగు, బంక, వేరుకుళ్లు వంటి తెగుళ్లు కారణంగా చెట్లు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు చెల్లించి క్రిమి సంహారక మందులు వాడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.పెరిగినపెట్టుబడి.. ఇటీవల చీనీ తోటల సాగుకు పెట్టుబడి పెరిగింది. ముఖ్యంగా ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు అధికమైంది. ఈ కారణంగా టన్ను చీనీ కాయలు రూ.40 వేల నుంచి రూ.50వేలు ఉంటేనే గిట్టుబాటయ్యే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. – గంగాధర్‌రెడ్డి, చీనీ రైతు, గురజాల టన్నుకు రూ.50 వేలు ఇవ్వాలి.. సూటు, కమీషన్‌ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చీనీ కాయలకు టన్నుకు రూ.50 వేలు తీసుకున్నప్పుడే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఇటీవల పంట సాగుకు వ్యయం పెరిగింది. కావున పులివెందుల మార్కెట్‌కు ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.- జగన్మోహన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు

➡️