చీరాల సీటు వెంకటేష్‌దే: మంత్రి మేరుగ

ప్రజాశక్తి-చీరాల: చీరాల వైసిపి సీటు కరణం వెంకటేష్‌దే అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అందరూ గెలిపించుకోవాలని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో రాష్ట్ర ప్రజల సొమ్ము చంద్రబాబు కాజేశారని అన్నారు. సోమవారం చీరాలలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఆయన, ఎంపి నందిగం సురేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఐఎంఏ హాలులో ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి, ఇన్చార్జి కరణం వెంకటేష్‌ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీసీలను టిడిపి బ్యాక్‌ వార్డ్‌ క్యాస్ట్‌, ఓట్‌ బ్యాంకు వర్గంగానే చూసినదని, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను బ్యాక్‌ బోన్‌ కమ్యూనిటీగా చూసి అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిలను చంద్రబాబు దారుణంగా మోసం చేశాడని అన్నారు. వైసిపి అభ్యర్థిగా కరణం వెంకటేష్‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో కరణం వెంకటేష్‌ బాబు క్రియాశీలక నేతగా పనిచేయనున్నారని అన్నారు. ఎంపీ నందిగామ సురేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరిగిన మోసాలను, జగనన్న అధికారానికి వచ్చిన తర్వాత జరిగిన మేలును వివరించేందుకే సాధికార యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మంత్రి పదవులు నుంచి నామినేటెడ్‌ పదవుల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగనన్న ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. బీసీలను అక్కున చేర్చుకున్న ఘనత జగనన్న దన్నారు. బీసీలను తెలుగుదేశం పార్టీ ఓట్‌ బ్యాంకుగా రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నదని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే భావాలున్న జగనన్నతో ఎంఎల్‌ఎ బలరాం రావడం గొప్ప విషయం అన్నారు. ఆయనకు వారసుడుగా వెంకటేష్‌ ప్రజలకు మేలు చేయనున్నారని అన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిలు, పేదలంతా జగన్మోహన్‌రెడ్డి వెంట ఉంటామని అన్నారు. ప్రజల అండ, దేవుని ఆశీస్సులు జగన్మోహన్‌రెడ్డికి ఉన్నాయని అన్నారు. ఇప్పుడు లోకేష్‌ ని పొగిడే వాళ్ళందరూ 2024 తర్వాత కూడా పొగడ గలరేమో ఆలోచించు కోవాలని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ వంటి వారిని ఈ రాష్ట్రం ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు. వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్‌ మాట్లాడారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్మోహన్‌రెడ్డిని ఆశీర్వదించి ఎన్నికలలో గెలిపించాలని కోరారు. సంక్షేమ పాలన కోసం మరోసారి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వరికూటి అమృతపాణి, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు పాల్గొన్నారు.

➡️