చెవిలో పువ్వులతో కార్మికుల నిరసన

Dec 28,2023 21:11

ప్రజాశక్తి- బొబ్బిలి:  మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు గురువారం వినూత్నంగా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజు కొనసాగింది. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన అమలు చేయకుండా సీఎం జగన్మోహన్‌ రెడ్డి చెవిలో పువ్వులు పెట్టారని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అద్యక్షులు గౌరీష్‌, నాయకులు యుగంధర్‌, వాసు, తదితరులు పాల్గొన్నారు.నెల్లిమర్ల: దండాలు మహప్రభో మా సమస్యలు పరిష్కరించాలని నగర పంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో నిరశన వ్యక్తం చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద గత మూడు రోజులుగా మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా గురువారం వినూత్న రీతిలో దండాలు పెట్టి అయ్యా మహ ప్రభో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మీరిచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటి సభ్యులు కిల్లంపల్లి రామారావు మాట్లాడుతూ సిఎం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కార్మికులు పోరాటం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టి. బాబూరావు, బి. హరిబాబు, జె.శ్రీను, బి. రాము, టి. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.కార్మికులకు మాజీ మంత్రి సంఘీభావంరాజాం: మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్‌ మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు సంఘీభావం వ్యక్తం చేశారు. జగన్‌ మూర్ఖత్వానికి అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు, మున్సిపాలిటీ కార్మికుల, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యలపై సమ్మెలో పాల్గొన్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో టిడిపి ప్రభుత్వం వస్తుందని సమస్యలు పరిష్కారానికి చంద్రబా బు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేగిడి మాజీ జెడ్‌పిటిసి మంతిని ఉషారాణి, జగన్మోహన్‌రావు, గురవాన నారాయణరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.విజయనగరం టౌన్‌: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా చెవిలో పూలు పెట్టుకుని విజయనగరం కార్పొరేషన్‌ కార్యాలయం ముందు కార్మికుల బైఠాయించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, నెల్లిమర,్ల రామతీర్థం, ముసిడిపల్లి పంప్‌ హౌస్‌ కార్మికులకు టర్న్‌కి సిస్టం రద్దు చేసి ఆప్కాస్‌ జీతాలు చెల్లించాలని, 6 నెలల బకాయిలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. మున్సిపల్‌ కార్యాలయానికి రాకపోకల అడ్డుకోవడంతో స్పందించిన అధికారులు కాంట్రాక్టర్‌తో మాట్లాడి రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ .జగన్మోహన్‌రావు, నాయకులు భాస్కర్‌ రావు, లక్ష్మణరావు మాట్లాడుతూ థర్డ్‌ పార్టీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పంప్‌ హౌస్‌ కార్మికులను, క్లాప్‌ వాహన డ్రైవర్లను కాంట్రాక్ట్‌ విధానంలో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. గత 22 ఏళ్ల నుంచి విజయనగరం మున్సిపాలిటీకి మంచినీరు అందిస్తున్న కార్మికులకు నెలకు రూ.9వేలు ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని, అడిగితే 2023 జూన్‌ నుంచి రూ.2వేలు పెంచారని, జూన్‌ నెలలో పెరిగిన 2వేలు నేటికీ కార్మికులకి ఇవ్వలేదని గుర్తు చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనకు పట్టణ పౌరు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు మద్దతు ప్రకటించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించిన వారిలో నెల్లిమర్ల, రామతీర్థం, ముసిడిపల్లి మాస్టర్‌ పంప్‌ హౌస్‌ కార్మికులతో పాటు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

➡️