చోరీ కేసులో ఒకరు అరెస్టు

Mar 19,2024 21:33

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌: గరుగుబిల్లి మండలం ఖడ్గవలస కూడలిలో ఒక ఇంట్లో జరిగిన చోరీ కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఒకర్ని అరెస్టు చేయగా, మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విక్రాంతి పాటిల్‌ మంగళవారం తెలిపారు. ఈ కేసు సంబంధించి వివరాలను ఆయన తెలిపారు. ఫిబ్రవరి 26న గరుగుబిల్లి మండలం సంతోషపురం పంచాయతీ లో గల ఖడ్గవలస జంక్షన్‌ సమీపన ఒంటరి గృహంలో నివసిస్తున్న కిమిడి శ్రీరామమూర్తి ఇంట్లో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. శ్రీరామ్మూర్తిని, ఆయన భార్య భాగ్య రత్నం దుండగులు కాళ్లు, చేతులు కట్టి, మూతికి ప్లాస్టర్‌ వేసి బీరువాలో ఉన్న సుమారు 87.5 తులాల బంగారాన్ని దుండగులు దోచుకుపోయారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తు కోసం 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డాయి. ఈ దొంగతనం కేసులో గరుగుబిల్లికి చెందిన ఒక వ్యక్తి, తూర్పు గోదావరికి చెందిన ఒకరు, బొబ్బిలి కి చెందిన ఒకరు ఈ దొంగతనానికి పథకం రచించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను తెప్పించి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇందులో ప్రధాన ముద్దాయిగా శంకరాపు నారాయణను గుర్తించారు. బొబ్బిలి రాజా కళాశాల మైదానం దగ్గర అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి దొంగలించబడిన బంగారంలో 18.87 తులాలు (220.700 గ్రాముల ) స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ దొంగతనంలో పాల్గొన్న బెంగాల్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను, గరుగుబిల్లికి, తూర్పు గోదావరికి చెందిన వారిని పట్టుకోడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు బృందాలుగా వ్యవహరిం చిన పాలకొండ డిఎస్‌పి జివి కృష్ణారావు, పార్వతీపురం రూరల్‌ సిఐ కె.రవికుమార్‌, చినమేరంగి సిఐ బి.మంగ రాజు, సిసిఎస్సిఐ ఎం.అప్పారావు, ట్రైనీ డిఎస్పి మహ మ్మద్‌ అజీజ్‌తో పాటు సహకరించిన పలు పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలను ఎస్పీ ప్రశంసిస్తూ రివార్డులను ప్రకటించారు.

➡️