జగనన్న తోడు నిధుల విడుదల

జగనన్న తోడు నిధుల విడుదల

ప్రజాశక్తి-కాకినాడ చిరు వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం ద్వారా మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న తోడు పథకం కింద ఎనిమిది విడతలో చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వత్తుల వారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేలు చొప్పున వడ్డీ లేని రుణాలను బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి ఎంపీ వంగా గీత, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి హాజరయ్యారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు మెగా చెక్‌లు అందజేశారు. మహిళలు ప్రదర్శించిన వస్తు ఉత్పత్తులను పరిశీలించి స్వయంగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతివత్తులు, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించాలని లక్ష్యంతో జగనన్న తోడు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా ఎనిమిదో విడతలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 10,995 మంది లబ్ధిదారులకు రూ.11.12 కోట్లు, పట్టణ ప్రాంతాలకు చెందిన 5,906 మంది లబ్ధిదారులకు రూ. 6.76 కోట్లు రుణాలు మంజూరైనట్లు తెలిపారు.

➡️