జగన్‌రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే కేసులు: గొట్టిపాటి

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌: నియోజకవర్గ పర్యటనలో భాగంగా బల్లికురవ మండలం కె రాజుపాలెం గ్రామంలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అంగన్వాడీలను తొలగిస్తూ జగన్‌ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద అర్థరాత్రి వేళ అంగన్వాడీల దీక్షను పోలీసులు భగం చేసి మహిళల పట్ల మగ పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాక బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం దారుణమని, జగన్‌రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే కేసులు, ఉద్యమిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఎమర్జెన్సీ తలపిస్తోందని అన్నారు. అంగన్వాడీ డిమాండ్లకు మద్దతుగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను జగన్‌రెడ్డికి సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశవికంగా పోలీసులతో దాడి చేయడం పిరికిపంద చర్యగా ఎమ్మెల్యే అభివర్ణించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం హిట్లర్‌ పాలనను తలపిస్తోంది అని ధ్వజమెత్తారు. నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న దీక్షా శిబిరంపై అర్ధరాత్రి కరెంటు తీసివేసి శిబిరాన్ని కూల్చి, ఆడవాళ్లను కూడా మగ పోలీసులే అరెస్టు చేసి బస్సుల్లో కుక్కి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో వారికి చెప్పకుండా గందరగోళం సష్టించి అనాగరికంగా వ్యవహరించారంటే మహిళల పట్ల జగన్‌ రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు అన్నారు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయబద్ధమైందని, వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

➡️