జగన్‌ పాలనను అంతమొందించడమే లక్ష్యం

Feb 6,2024 21:00

ప్రజాశక్తి- మెంటాడ : ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టిన జగన్మోహన్‌ రెడ్డి పాలనను అంతమొందిచడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం జనసేన పార్టీ కార్యాలయాన్ని మాజీమంత్రి పడాల అరుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన జన గర్జన సభలో యశస్విని మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం లేదన్నారు. వేలకోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యమని గుర్తు చేశారు. మాజీమంత్రి పడాల అరుణ మాట్లాడుతూ రాష్ట్ర పురోగతిని తుంగలోకి తొక్కారని, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. జనసేన మండల అధ్యక్షులు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెంటాడ మాజీ సర్పంచ్‌ దేవుడు బాబు, గజపతినగరం జనసేన మండల అధ్యక్షులు మోహన్‌ రఘురాం కృష్ణంరాజు, ఆదాడమోహన్‌, టిడిపి నేతలు రెడ్డి రాజగోపాల్‌, రాయిపిల్లి రవిశంకర్‌, కొల్లా భరత్‌, జనసేన పార్టీ నేతలు పాండ్రంకి శ్రీనివాసరావు, శివ, మండల సురేష్‌, పలు గ్రామాలకు చెందిన జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️