జగన్‌ సర్కార్‌ మూల్యం చెల్లించక తప్పదు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తున్న జగన్‌ సర్కార్‌ తగు మూల్యం చెల్లించక తప్పదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్‌ హెచ్చరించారు. బుధవారం యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహావీర్‌ సర్కిల్‌ నుంచి యుటిఎఫ్‌ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని కలెక్టరేట్‌ వరకు నడుస్తూ వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరించడం తగదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకిచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకపోగా ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో అన్ని రకాలుగా ఉద్యోగులను వంచించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి అంతకంటే దుర్మార్గమైన జిపిఎస్‌ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల తమ వైఖరిని చాటుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ అవసరాల కోసం కూడబెట్టుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎపిజిఎల్‌ఐ సొమ్ములను సైతం ఉద్యోగులకు తెలియకుండానే కాజేసి ప్రభుత్వం తమ అవస రాలకు మళ్లించుకుందని ఆరోపించారు. బకాయిల కోసం ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నా ‘చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు’ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించకపోతే జనవరి 31 నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్‌, ట్రెజరర్‌ కె.నరసింహారావు జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఎ.శ్రీనివాసులు, ఎస్‌.ఏజాస్‌ అహ్మద్‌, నాయకులు వి.నాగరాజు, జి.సమీర్‌ బాష, జి.గోపినాథ్‌ ఎం.చెన్నకేశవులు, ఆర్‌. కీర్తి కుమార్‌, పి కిరణ్‌ కుమార్‌,ఎం.బాబు, జి.వెంకటసుబ్బయ్య, డి.కిరణ్‌ కుమార్‌, పి.ఫయాజుద్దీన్‌, కె.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

➡️