జనం కోసం స్వరాజ్యం అవిశ్రాంత పోరాటం

Mar 20,2024 22:20

మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి సభ పట్టణంలోని ఫణిదం సొసైటీ వద్ద ఐద్వా నాయకులు డి.విమల అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జి.రజిని, పట్టణ కార్యదర్శి జి.ఉమశ్రీ మాట్లాడుతూ భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం మల్లు స్వరాజ్యం ప్రాణాలకు తెగించి పోరాడారని, నైజాం నవాబు అరాచాకాలను అడ్డుకోవటం కోసం 12 ఏళ్లకే తుపాకి చేపట్టి దళ నాయకురాలిగా ఎదిగారని చెప్పారు. తన పాటలతో దళ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపడంతోపాటు ప్రజలల్లోనూ చైతన్యం తెచ్చేవారని గుర్తు చేశారు. ఎన్‌టి రామారావు సిఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను సమీకరించి మద్యాపన నిషేధం, మహిళలకు ఆస్తి హక్కు కోసం, మరుగుదొడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించారని తెలిపారు. మహిళల స్థితిగతులు మెరుగవుతున్న నేటి దశలో మళ్లీ మహిళ అణచివేత దిశగా, సతీసహగమనం వంటి దురాచారాలు అమలైన కాలానికి సమాజాన్ని తీసుకెళ్లేందుకు కేంద్రంలోని బిజెపి యత్నిస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో మహిళలపై ఇటీవల జరిగిన దారుణాలు బిజెపి నిర్వాకమేనని మండిపడ్డారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా, మహిళల అభ్యున్నతి కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తొలుత మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సభలో ఎం.జ్యోతి, ఎ.వీరబ్ర హ్మం, జి.హనుమాయమ్మ, రమాదేవి, రమణ, మస్తాన్‌రావు పాల్గొన్నారు.

➡️