జనసేనకు టిడిపి సహాయ నిరాకరణ

Mar 19,2024 21:46

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి టిడిపి నుంచి సహాయ నిరాకరణ కనిపిస్తోంది. జనసేన పార్టీ తరపున లోకం మాధవిని ప్రకటించి సరిగ్గా నెలరోజులు కావస్తోంది. ఇప్పటి వరకు ఆమె వెంట తెలుగు దేశం పార్టీ నాయకులు గానీ, క్రీయాశీలక కార్యకర్తలు గానీ వెళ్లలేదు. మరోవైపు ఈ సీటు టిడిపికి మాత్రమే కేటాయించాలని కొందరు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకు మాత్రమే కేటాయించాలని మరికొందరు ప్రకటనలు చేశారు. నాలుగు మండలాలకు చెందిన కీలక నాయకులు ఏకంగా టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడ్ని నేరుగా కలిసి బంగార్రాజుకు న్యాయం చేయాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయనగరం పార్లమెంట్‌ స్థానం పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించినట్టు వార్తలు వెలువడడంతో ఈ నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లంతా అగ్గిమీద గుగ్గిలమౌతున్నారు. ఎమ్మెల్యేకు కాకపోతే ఎంపీ స్థానానికైనా తమ పార్టీ తరపు అభ్యర్థికి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసుకోవచ్చని భావించామని, ఈ రెండు సీట్లూ జనసేన, టిడిపికి కేటాయించడం వల్ల నియోజకవర్గంలో ఏకంగా సైకిల్‌ గుర్తే కనిపించే పరిస్థితి లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, లేదా ఎమ్మెల్యే సీటు టిడిపికి ఇవ్వకపోతే నెల్లిమర్ల అసెంబ్లీ స్థానంలో టిడిపి ఉనికి కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. ఇలా టిడిపి నాయకులు, కేడర్‌ సహాయ నిరాకరణ, వ్యతిరేకత ప్రదర్శిస్తుండడంతో మాధవి యూటర్న్‌ తీసుకుని వైసిపిలోని కొంతమందిని ఆకర్షించే పనిలో నిమగమయ్యారు. ఇందులో భాగంగానే భోగాపురం మండలానికి చెందిన కాకర్లపూడి శ్రీనివాసరాజు వైసిపికి రాజీనామా చేసినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే ఆయన క్యాంపు కార్యాలయంలోనే ఆయన అభిమానులు ఇటీవల జనసేనలో చేరారు. వ్యవహారం ముదురపాకాన పడుతున్నప్పటికీ టిడిపి, జనసేన రాష్ట్ర పార్టీ నేతలు పట్టించు కోకపోవడం అటు జనసేన, ఇటు టిడిపి కేడర్‌లో గందర గోళ పరిస్థితి నెలకుంది. పూసపాటిరేగ మండలంలో కూడా పలువురు వైసిపి సర్పంచులు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు బంగార్రాజు కూడా మౌనం వీడడం లేదు. కొద్దిరోజులపాటు స్తబ్ధతగా ఉండాలని పార్టీ కేడర్‌ను కోరారట. భవిష్యత్తుకు భరోసా ఇచ్చేవరకు మౌనం వీడే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈలోపు ప్రత్యర్థి ప్రచారం, వ్యతిరేక నినాదంతో జనసేన అభ్యర్థి లోలోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు భీమిలి నియోజకవర్గం అభ్యర్థికి టిడిపి అధిష్టానం పరిశీలిస్తున్న పేర్లలో బంగార్రాజు పేరు కూడా ఉందని ప్రచారం నడుస్తోంది. టిడిపిలో మిగిలిన సీట్ల భర్తీకి అభ్యర్థులను ఖరారు చేస్తే తప్ప నెల్లిమర్లలో పరిస్థితులు చక్కబడే పరిస్థితులు కనిపించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

➡️