జమ్మయ్యపేటకు కొత్త రహదారి

Dec 10,2023 20:52

ప్రజాశక్తి-భోగాపురం  :  విమానాశ్రయ నిర్మాణంలో సవరవల్లి నుంచి సన్‌రే వై జంక్షను మీదుగా జమ్మయ్యపేట గ్రామానికి వెళ్లే రహదారి కనుమరుగు కానుంది. దీంతో ఈ రహదారి నుంచి వెళ్లే సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రామాలకు కొత్త రహదారిని వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కొత్తగా భూసేకరణ చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్దమవుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా విమానాశ్రయం భూములు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. సవరవల్లి వద్ద జాతీయరహదారి నుంచి జమ్మయ్యపేట వెళ్లే రహదారి విమానాశ్రయం భూముల మధ్యలో ఉంది. ఈ రహదారి మీదుగా రన్‌వే నిర్మించనున్నారు. ఈ రహదారి తొలగిస్తే జమ్మయ్యపేట, కవులవాడ, పెద కవులవాడ, తూడెం, బసవపాలెం గ్రామాలకు వెళ్లేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. సవరవల్లి నుంచి రావాడ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.విమానాశ్రయ ప్రహరీగోడ ప్రక్కనుంచే కొత్త రహదారిగతంలో జమ్మయ్యపేట నుంచి రావాడ మీదుగా రహదారి నిర్మించాలని అధికారులు భావించారు. కాని ఏమైందో తెలియదు కాని మళ్లీ విమానాశ్రయం ప్రహరీ గోడ ప్రక్క నుంచి కొత్త రహదారిని వేయాలని నిర్ణయించారు. ఈ రహదారిని జమ్మయ్యపేట నుంచి ప్రహరీగోడ ప్రక్క నుంచి సన్‌రే వై జంక్షను వద్ద కలపనున్నారు. దీనికోసం అవసరమైన భూమిని సేకరించేందుకు సిద్ధమయ్యారు. సర్వే నెంబర్ల వారీగా ఎంత భూమి అవసరమో విఆర్‌ఒలు సర్వే చేశారు. రావాడ, కవులవాడ రెవెన్యూ గ్రామాల్లోని భూములు సేకరించనున్నారు. రహదారి నిర్మాణానికి భూసేకరణ చేస్తాంవిమానాశ్రయంలో జమ్మయ్యపేట వెళ్లే రహదారి కనుమరుగు కానుంది. అందుకు ఆ రహదారిలో ఉండే గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు విమానాశ్రయం ప్రహరీగోడ చుట్టూ కొత్త రహదారిని నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన భూసేకరణ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు చేయనున్నాం. చింతాడ బంగార్రాజు, తహశీల్దారు, భోగాపురం మండలం.

➡️