జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో పతకాలు

Dec 31,2023 20:52

ప్రజాశక్తి- నెల్లిమర్ల : జాతీయ స్థాయి పురుష, మహిళా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొండ వెలగాడ క్రీడాకారిణి ప్రతిభ కనబర్చి రజత పతకం సాధించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇటానగర్‌ రాజీవ్‌ గాంధీ యునివర్సటీలో డిసెంబరు 28 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి మెన్‌, ఉమెన్‌ యూత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో కొండ వెలగాడకు చెందిన బెల్లాన భార్గవి ఆదివారం 40 కిలోల విభాగంలో ప్రతిభ కనబర్చి రజత పతకం సాధించింది. ఇదే పోటీల్లో యువజన విభాగంలో చంద్రం పేటకు చెందిన కె. దినేష్‌ 67 కిలోల విభాగంలో స్నాచ్‌ 108 కిలోలు, క్లీన్‌ జర్క్‌ 132 కిలోలు మొత్తం 240 కిలోలు బరువెత్తి బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి.లక్ష్మీ, స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బి. వెంకట రామయ్య, కోచ్‌ చల్లా రాము అభినందించారు.

నెల్లిమర్ల : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ పి.సురేశ్‌బాబు అన్నారు. ఇటీవల మాస్టర్‌ అథ్లెట్‌ పోటీల్లో పూతిక పేటకు చెందిన పి. పైడి రాజు గోల్డ్‌, సిల్వర్‌ మెడల్‌ సాధించిన సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు ఆదివారం మొయిదలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సచివాలయ పరిధిలోనూ ఈ క్రీడాపోటీలు నిర్వహించడం వల్ల ప్రతిభ గల క్రీడాకారులకు తగిన వేదికను కల్పించాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా పోటీలు జరగలేదన్నారు. పైడిరాజు మరెన్నో మెడల్స్‌ సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. నెల్లిమర్లలో షెటిల్‌ బ్యాడ్మింటెన్‌ క్రీడా వసతి గురించి క్రీడాకారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. స్టేడియం లేక ఇబ్బందులు పడుతున్నామని క్రీడాకారులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. షటిల్‌ ఆడేవాళ్లు సుమారు వంద మంది వరకూ ఉన్నారని, స్టేడియం నిర్మిస్తే క్రీడాకారులను తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని విన్నవించారు. ఆ మేరకు, త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి క్రీడావసతి కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దవళ లక్ష్మణరావు, నెల్లిమర్ల షటిల్‌ బ్యాడ్మింటెన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వి.ఎం.కె. లక్ష్మణరావు, నల్లి శివ, శ్రీను, శేఖర్‌, రంగా, మద్దిల చిన్నా, భాస్కరరావు, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️