జిందాల్‌తో ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలి

 ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జిందాల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలని విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 1050వ రోజుకు చేరుకున్నాయి. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలకు 1000 రోజులు కావడంతో దానికి సంఘీభావంగా వేలాదిమంది కార్మికులు కూర్మన్నపాలెం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్‌ మాట్లాడుతూ, ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకుంటామని స్పష్టంచేశారు. రూ.3000 కోట్ల పెట్టుబడి పెడితే రూ.5 లక్షల కోట్ల లాభం వచ్చే కంపెనీ అని తెలిపారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ, స్టీల్‌ కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయకుండా యాజమాన్యం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌లో ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేంద్రం స్టీల్‌ యాజమాన్యంపై ఒత్తిడి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు కెఎస్‌ఎన్‌.రావు, యు.రామస్వామి, వైటి.దాస్‌, కారు రమణ, డి.సురేష్‌బాబు, రామ్మోహన్‌కుమార్‌, గణపతి రెడ్డి, సిహెచ్‌.సన్యాసిరావు, ఎన్‌.రామారావు, జె.రామకృష్ణ, వి.ప్రసాద్‌, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

➡️