జిఎంసి పోస్టుల భర్తీలో ఇష్టారాజ్యం

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా వైద్యకళాశాల పరిధిలోని మానసిక, క్యాన్సర్‌, సూపర్‌స్పెషాలిటీ, పులివెందుల వైద్య కళాశాల పరిధిలోని ఐఎంఎస్‌ పరిధిలో 14 కేటగిరీలు, కేన్సర్‌ కేర్‌ పరిధిలో 10, జిఎంసి పరిధిలో 06, జిజిహెచ్‌ పరిధిలోని 21 కేటగిరీలకు చెందిన 196 పోస్టులకు పోస్టులకు భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. రెండు నెలల కింద నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగార్ధులు ఎనిమిది వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. సుధీర్ఘ స్క్రీనింగ్‌ అనంతరం ఆయా కేట గిరీల పరిధిలోని పోస్టుల భర్తీకి అర్హతల పరిశీలన, రిజర్వేషన్లు, సీని యారిటీ తదితర ప్రక్రియల్ని పరిశీలించాలి. ఫైనల్‌ లిస్టు ప్రకటన అనంతరం సెలెక్షన్‌ లిస్టును విడుదల చేయాలి. స్క్రీనింగ్‌ దశలో గ్రీవెన్స్‌ ఎదురైతే రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టు పెట్టిన అనంతరం సెలెక్షన్‌ లిస్టు విడుదల చేయాలి. కానీ ఇక్కడ రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టు పెట్టకుండానే సెక్షన్స్‌ లిస్టును విడుదల చేయడంతో గందరగోళం నెలకొంది. న్యూక్లియర్‌ మెడిసిన్‌ ఫిజిసిస్ట్‌ అర్హతల్ని మెడిసిన్‌ ఫిజిసిస్ట్‌ కేటగిరీల్లోకి చూపించారు. దేశంలోని కేరళ, ఉస్మానియా వంటి ఐదారు యూనివర్శిటీల్లో న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌ కోర్సును చదివిన తమను నిర్లక్ష్యం చేయడమేమిటని ఉద్యోగార్థులు వాపోతున్నారు. కర్నూలు, గుంటూరు వైద్య కళాశాలల ఉన్నతాధికారులు ఆధునిక కోర్సు కావడంతో పొరపాటు పడిన కారణంగా రీనోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేశారని, ఇక్కడ ఇగోకు పోయి జీవితాలతో ఆడుకోవడం తగదని వాపోతున్నారు. బ్లడ్‌బ్యాంక్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎస్‌సి కేటగిరీ వ్యక్తిని ఒసి కేటగిరీలో చూపించి భర్తీ చేయడం, ఎస్‌సి కేటగిరీలో వేకెంట్‌ చూపించారు. కేన్సర్‌ ల్యాబ్స్‌ కేటగిరీలో సంబేపల్లికి చెందిన ఓ వ్యక్తి 71 మార్కుల మెరిట్‌తో ఉండగా, 70 మార్కులు కలిగిన వ్యక్తికి మెరిట్‌గా చూపించడంపై చర్చనీయాంశమైంది. కడప జిజిహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు జూనియర్లకు అవకాశం కల్పించి తనకు అన్యాయం చేయడంపై క్లారిటీ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించినా ఇవ్వక పోవడమేమిటని ప్రశ్న వినిపిస్తోంది. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ కేటగిరీలో 12 మంది పీజీ (డిప్లమా) ఉద్యోగార్ధులను విస్మరించి డిగ్రీ చేసిన ఉద్యోగార్ధులకు అవకాశం కల్పించడమేమిటనే ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై పలువురు నిరుద్యోగార్ధులు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నిటికంటే ముందు రివైజ్డ్‌ ఫైనల్‌ మెరిట్‌ లిస్టును పెట్టకుండా, సెలెక్షన్‌ లిస్టును ప్రకటించడమేమిటని ప్రశ్న వినిపిస్తోంది. పలువురు ఉద్యోగార్థులు ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ సురేఖను చుట్టుముట్టి అభ్యర్థలను వినిపించారు. దీనికి ప్రిన్సిపల్‌ స్పందించి మెరిట్‌ లిస్టు పెట్టామని సమర్థించుకునే ప్రయత్నం చేయడం కని పించింది. తాము స్పష్టమైన అవగాహనతోనే ముందుకెళ్లామని, మీ అభ్యర్థనలేమైనా ఉంటే ఇవ్వాలని సూచించారు. మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు స్పందించి ముందు రివైజ్డ్‌ ఫైనల్‌ మెరిట్‌ లిస్టు పెట్టాలని పట్టుబట్టారు. చాలా మంది నష్టపోతారని, భవిష్యత్‌లో దుష్ఫలితాలు వస్తాయని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రిన్సిపల్‌ సానుకూలంగా స్పందించారు. ఇదిలాఉండగా ఇప్ప టికే కలెక్టర్‌ అప్రూవల్‌ చేసిన నేపథ్యంలో ఐఎంఎస్‌, కేన్సర్‌ కేర్‌, జిఎంసి, జిజిహెచ్‌, పులివెందుల మెడికల్‌ కళాశాలకు చెందిన 196 పోస్టుల్లో 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన 66 పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్లలో తప్పిదాలు, ఇతర కారణాల కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం కమిటీ సభ్యులు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలించిన అనంతరం నియామక ఉత్తర్వులు ఇచ్చే పనిలో నిమగం కానున్నట్లు తెలుస్తోంది.

➡️