జిల్లాలో 13,994 మందికి వడ్డీ రాయితీ

చెక్కు అందజేస్తున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి

ప్రజాశక్తి-అనకాపల్లి

జిల్లాలో 13,994 మంది గృహ లబ్ధిదారులకు రూ.1.34 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చెక్కును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేదవారి సొంతింటి కల సాకారమయ్యేందుకు ప్రభుత్వం జిల్లాలోని 1394 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అదనపు రుణంపై మొదటి విడత వడ్డీ రాయితీగా ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 43,904 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున రూ.154.67 కోట్ల మేర అదనపు రుణ సదుపాయం కల్పించడం జరిగిందని చెప్పారు. ఆ రుణాలు తీసుకున్న లబ్దిదారులు తదుపరి దశకు చెందిన ఇళ్ళ నిర్మాణ పురోగతి సాధించిన వారిలో ఇప్పటి వరకూ 13,994 మందికి రూ.1,33,67,055 మేర తొలి విడత వడ్డీ రాయితీ సొమ్ము ఆయా లబ్దిదారుల ఖాతాకు జమ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్క లబ్దిదారులు సొంత ఇంటి నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రభుత్వం అందచేస్తున్న ప్రోత్సాహం ద్వారా ప్రయోజనం పొందచ్చన్నారు. ఈ సమావేశంలో ఎస్‌డిసి, గృహ నిర్మాణ శాఖ పిడి కే.రమామణి, డిఆర్‌డిఎ పి.డి. శచీదేవి, లబ్ధిదారులు పాల్గొన్నారు.విశాఖ జిల్లాలో 14,872 మందికి..విశాఖ కలెక్టరేట్‌ : నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా విశాఖ జిల్లాలో 14,872 మంది లబ్ధిదారులు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.90.18 లక్షలు లబ్ధిపొందినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ నిధులను బటన్‌ నొక్కి విడుదల చేయగా వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో విశాఖ నుంచి కలెక్టర్‌ మల్లికార్జున, నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పాల్గొన్నారు.

➡️