జీడి రైతులకు భరోసా ఏదీ?

Mar 19,2024 21:24

ప్రజాశక్తి – కొమరాడ : ఏజెన్సీలోని జీడి గిరిజన రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన భరోసా ఎక్కడని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. మండలంలోని కుమ్మరిగుంట పంచాయితీ దంగభద్రలో జీడి తోటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి రైతులకు భరోసా ఎక్కడీ అధికారుల మాటలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించినప్పటికీ సంబంధించిత పనులు మాత్రం ఐటిడిఎ కార్యాలయం దాటని పరిస్థితి లేదని తెలిపారు. ఐటిడిఎ పరిధిలోని కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, మక్కువ, పాచిపెంట, సాలూరు, పార్వతీపురం మండలాల్లో గిరిజన రైతులు ఎక్కువ జీడి తోటలు వేసి పండించే పరిస్థితి ఉందన్నారు. గిరిజనులకు జీడి పంట ప్రధానమైన పంట ఇంతకన్నా ముఖ్యమైన పంట మరొకటి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీడి పంటకు గిట్టిబాటు కల్పించే పరిస్థితి లేదన్నారు. అధికారుల వైఫల్యంతో దళారులు తమ ఇష్టమొచ్చిన రేటుకు జీడి పిక్కలు కొనుక్కొని మూడుపూలు, ఆరుకాయలుగా వ్యాపారం సాగిస్తున్నారని అన్నారు. జీడి తోటలకు మదుపు బాగా పెట్టినప్పటికీ అందుకు తగ్గట్టుగా ధరలేకపోవడంతో రైతులు అప్పుల పాలై నష్టాల బారినపడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీడికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు.

➡️